Leader: శేఖర్ కమ్ముల తీర్చిదిద్దిన 'లీడర్' రానా!
ABN , Publish Date - Feb 19 , 2025 | 03:12 PM
సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు తనయుడు రానా ను హీరోగా పరిచయంచేస్తూ ఏవీయం సంస్థ 'లీడర్' మూవీని నిర్మిస్తే... దానిని అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ సంస్థ పంపిణీ చేయడం విశేషం.
కొత్తవారిని పరిచయం చేయడంలో మొదటి నుంచీ దర్శకుడు శేఖర్ కమ్ముల తనదైన బాణీ పలికిస్తూ వస్తున్నారు. పదిహేనేళ్ళ క్రితం 'లీడర్' (Leader)లోనూ రానా దగ్గుబాటి (Rana Daggubati) ని హీరోగా పరిచయం చేశారు శేఖర్ కమ్ముల (Sekhar Kammula). ఆ సినిమా తరువాత నటునిగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ రానా 'భళ్ళాల దేవుడి'గా జనం మదిలో నిలిచారు. యావద్భారతాన్నీ తన నటనతో ఆకట్టుకుంటూ మరికొన్ని సినిమాల్లోనూ రానా అలరించారు. అందుకు పునాది వేసిన చిత్రంగా 'లీడర్' నిలచిపోయింది. 2010 ఫిబ్రవరి 19న జనం ముందు నిలచిన 'లీడర్' మంచి ఆదరణ చూరగొంది. ప్రపంచ రికార్డు నెలకొల్పిన 'సురేశ్ ప్రొడక్షన్స్' (Suresh Productions) సంస్థ వారసుడైన రానాను హీరోగా పరిచయం చేసింది మరో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ 'ఏవీయమ్ ప్రొడక్షన్స్' (AVM Productions) కావడం విశేషం! ఇంకో విశేషమేంటంటే, 'లీడర్' చిత్రాన్ని పంపిణీ చేసింది మరో ప్రముఖ సంస్థ 'గీతా ఆర్ట్స్' (Geeta Arts) పంపణీ చేయడం మరింత విశేషం!
శేఖర్ కమ్ముల తెరకెక్కించే కథల్లో హృదయాలను హత్తుకొనే సన్నివేశాలు తప్పనిసరిగా ఉంటాయి. 'లీడర్'లోనూ అదే పంథాలో సాగారు శేఖర్. ముఖ్యమంత్రి అయిన తండ్రి మరణించగానే విదేశాల నుండి వచ్చిన హీరో, తరువాత పరిస్థితులను పసిగట్టి తానే ముఖ్యమంత్రి అవుతాడు. ఆ పదవికోసం హీరో దాయాది సోదరుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. ముఖ్యమంత్రిగా తన పదవి నిలుపుకోవడం కోసం అడ్డదారులు తొక్కవలసి వస్తుంది. ఆ విషయాన్ని తన కన్నతల్లికి చెబుతాడు హీరో. తన కొడుకు ఓ 'లీడర్' కావాలని కోరుకున్నాను కానీ, ఓ 'పొలిటీషియన్' కాకూడదని చెబుతుందామె. తల్లి మరణంతో పరివర్తన చెందిన హీరో నిజాయితీగా ఎన్నికల్లో నించుని జనం మదిని గెలుస్తాడు - ఇదీ 'లీడర్' కథ! శేఖర్ ఈ కథను పలు సెన్సిటివ్ సీన్స్ తో రక్తి కట్టించారు.
రిచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్ (Priya Anand) , హర్షవర్ధన్, భరణి, సుహాసిని, సుమన్, కోట శ్రీనివాసరావు, సుబ్బరాజు ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి విక్కీ జె.మేయర్ సంగీతం ఆకట్టుకొనేలా సాగింది. ఇందులో శంకరంబాడి సుందరాచారి రాసిన విఖ్యాత గీతం "మా తెలుగు తల్లికి మల్లెపూదండ..." పాటను సందర్భోచితంగా వినియోగించుకున్నారు. ఆ పాటను తొలిసారి గానం చేసిన నటి, గాయని టంగుటూరి సూర్యకుమారి గాత్రాన్నే చిత్రంలో వినిపించడం విశేషం! అలాగే రాయప్రోలు సుబ్బారావు రాసిన "శ్రీలు పొంగిన జీవగడ్డ..." పాటను కూడా సందర్భశుద్ధిగా కనిపిస్తుంది. ఇక ఇందులోని నాలుగు పాటలను వేటూరి (Veturi) రాశారు.
సినిమా విడుదలైన తరువాత నటునిగా రానాకు మంచి మార్కులు లభించాయి. ఎందువల్లో 'లీడర్' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. కానీ, ఇందులోని కథ, కథనం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అందుకు నిదర్శనంగా బుల్లితెరపై 'లీడర్' ప్రసారమవుతూ ఉంటే నవతరం ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇదే కథాంశంతో తరువాతి రోజుల్లో మహేశ్ బాబు హీరోగా 'భరత్ అనే నేను' రూపొందింది. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలచింది. ఏది ఏమైనా తొలి చిత్రంలోనే రానా నటునిగా మంచి పేరు సంపాదించడానికి దర్శకుడు శేఖర్ కమ్ముల కారణమని చెప్పక తప్పదు.