Priyadarshi: సమ్మర్ కే జాతకం చెబుతానంటున్న సారంగపాణి
ABN , Publish Date - Feb 23 , 2025 | 05:02 PM
ప్రియదర్శి, రూప కొడవాయూర్ జంటగా నటించిన సినిమా 'సారంగపాణి జాతకం'. మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ చిత్రం వేసవి కానుకగా విడుదల కాబోతోంది.
శ్రీదేవి మూవీస్ పతాకంపై సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'సారంగపాణి జాతకం' (Sarangapani Jathakam). మోహనకృష్ణ ఇంద్రగంటి (Mohanakrishna Indraganti) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ప్రియదర్శి (Priyadarshi), రూప కొడవాయూర్ జంటగా నటించారు. ఇప్పటికే ఈ సినిమాను విడుదలైన టైటిల్ సాంగ్ 'సారంగో సారంగా', 'సంచారి సంచారీ' ట్రెండ్ అవుతున్నాయి. అలానే టీజర్ కు మంచి స్పందన లభిస్తోంది.
'జెంటిల్ మన్, సమ్మోహనం' చిత్రాల దర్వాత శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న మూడో చిత్రమిది. ఈ సినిమాను వేసవి కానుకగా విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తాజాగా తెలిపారు. సినిమా చిత్రీకరణ పూర్తయ్యిందని, డబ్బింగ్ తో పాటు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సైతం తుదిదశకు చేరుకుందని తెలిపారు. మనిషి భవిష్యత్తు చేతి రేఖల్లో ఉంటుందా? చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు ఈ సినిమా జవాబు ఇస్తుందని, ఇంటిల్లిపాదిని కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు ఇందులో ఉంటాయని మోహనకృష్ణ ఇంద్రగంటి తెలిపారు. వివేక్ సాగర్ (Vivek Sagar) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.