Victory Venkatesh: వెంకీ మామ సెంచరీ.. నాటౌట్! బ్లాక్‌బస్టర్ పొంగలూ!
ABN , Publish Date - Jan 18 , 2025 | 03:53 PM
విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో వచ్చి పెద్ద సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా విడుదలై నాలుగు రోజులు పూర్తయింది. నాలుగు రోజులుగా ఈ సినిమాకు కలెక్షన్ల సునామీ నడుస్తోంది. అతి త్వరలో వెంకీ మామ ఈ సినిమాతో రూ. 200 కోట్ల క్లబ్‌లోకి అడుగు పెట్టనున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే..
వెంకీ మామ విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో జనవరి 14న సంక్రాంతి స్పెషల్‌గా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్‌ని కొరికేస్తుందంతే. కేవలం మూడంటే మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. విడుదలైన అన్ని ఏరియాల్లో బ్రేకీవెన్ సాధించింది. ఈ సక్సెస్ ఊపుని నాలుగో రోజు కూడా ఈ సినిమా ప్రదర్శించింది. టోటల్‌గా ఈ సినిమా విడుదలైన నాలుగు రోజులకుగానూ ప్రపంచవ్యాప్తంగా రూ. 131 కోట్ల ప్లస్ గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ వదిలారు. (Sankranthiki Vasthunnam Collections)
Also Read-Sankranthiki Vasthunnam Review: వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఎలా ఉందంటే
ఈ పోస్టర్‌లో వెంకీ డబుల్ ట్రీట్ ఇస్తే.. హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి చక్కగా నవ్వుతూ ఉన్నారు. ఈ సంక్రాంతి వెంకీమామదే అనేలా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ స్పందిస్తుండటం విశేషం. సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ సినిమాలతో పోటీగా వచ్చిన ఈ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా.. విడుదలకు ముందు నుండి పాజిటివ్ వైబ్స్‌ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో సఫలమైంది. మరీ ముఖ్యంగా ‘గోదారి గట్టు’ సాంగ్ విడుదలైన తర్వాత ఎక్కడ విన్నా అదే పాట వినబడటం మొదలైంది. అంతే ఆటోమేటిగ్గా సినిమాపై ఆసక్తి మొదలైంది.
ఆ ఆసక్తిని ట్రైలర్ మరింతగా పెంచేసింది. దీంతో సంక్రాంతికి ఏ హీరో సినిమా ఉన్నా సరే.. వెంకీ మామ సినిమా చూడాలనేలా అందరిలో ఆలోచన మొదలయ్యేలా ప్రమోషన్స్ హోరు కూడా నడిచింది. వీటన్నింటికి తగ్గట్టుగా సినిమా విడుదలై, మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి వారు కొనియాడటం ఈ సినిమాకు వరమైంది. అందుకే వీక్ డేస్, వీకెండ్ అనే తేడా లేకుండా హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఈ సినిమా థియేటర్లలో కలెక్షన్ల విధ్వంసం సృష్టిస్తోంది. ఇదిలానే కంటిన్యూ అయితే మాత్రం ఈజీగా వెంకీమామ రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరడం పక్కా అనేలా ట్రేడ్ నిపుణులు సైతం చెబుతుండటం గమనార్హం. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు చార్ట్‌బస్టర్ మ్యూజిక్ అందించారు.