Sankranthiki vasthunam: ఓటీటీ కన్నా ముందే.. ఇదేం ట్విస్ట్ చినరాజు

ABN , Publish Date - Feb 22 , 2025 | 05:09 PM

‘సంక్రాంతికి వస్తున్నాం" చిత్రం  ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులంతా  ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జీ తెలుగు నేడు ఆసక్తికర ప్రకటన చేసింది.  

‘సంక్రాంతికి వస్తున్నాం’తో (Sankranthiki Vasthunnam) ఈ ఏడాది సంక్రాంతికి భారీ విజయం అందుకున్నారు అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌ (Venkatesh). ఆయన హీరోగా అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులంతా  ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జీ తెలుగు నేడు ఆసక్తికర ప్రకటన చేసింది. మార్చి 1న సాయంత్రం ఆరు గంటలకు టెలివిజన్‌ ప్రీమియర్‌గా ( Television premiere) ఈ సినిమా ప్రసారం కానుందని తెలిపింది. సాధారణంగా ఏదైనా సినిమా థియేటర్లలో విడుదలయ్యాక కొన్ని వారాలకు ఓటీటీలోకి (OTT) అడుగుపెడుతుంది. ఈక్రమంలోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా అదే ట్రెండ్‌ను ఫాలో అవుతుందని సినీప్రియులు భావించారు. జీ తెలుగు నుంచి ఈ సినిమా గురించి ప్రకటన వచ్చినప్పటికీ దానికి ఇంకా సమయం ఉంటుందని.. ముందు ఓటీటీలోనే వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే సినీప్రియుల అంచనాలను తారుమారు చేస్తూ తాజాగా టెలివిజన్‌ ప్రీమియర్‌కు సంబంధించిన ప్రకటన వెలువడటంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిందని మాట్లాడుకుంటున్నారు.  


కథ... 

అమెరికాలో పెద్ద వ్యాపారవేత్తగా వెలుగొందుతున్న తెలుగువాడు సత్య ఆకెళ్ల (అవసరాల శ్రీనివాస్‌). అతనితో  సొంత రాష్ట్రంలో ఓ నాలుగైదు కంపెనీలు పెట్టించి.. ప్రజల మన్ననలు పొందాలన్న ఆలోచనతో తెలంగాణ సీఎం కేశవ (నరేశ్‌) అతనిని హైదరాబాద్‌కు తీసుకొస్తారు. అతని సెక్యురిటీ బాధ్యతల్ని సీఎం మీనాక్షి (మీనాక్షి చౌదరి)కి అప్పజెబుతాడు. అయితే సత్య భాగ్యనగరానికి రాగానే పాండే గ్యాంగ్‌ అతన్ని కిడ్నాప్‌ చేస్తుంది. అయితే ఈ విషయం బయటకు పొక్కితే ప్రభుత్వం పడిపోతుందన్న భయంతో సీఎం కేశవ.. ఓ రహస్య ఆపరేషన్‌ చేపట్టాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం మాజీ పోలీస్‌ అధికారి, ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ యాదగిరి దామోదర రాజు అలియాస్‌ చిన్నరాజు (వెంకటేశ్‌)ను రంగంలోకి దించాలని భావిస్తారు. దీంతో ఈ ఆపరేషన్‌ కోసం రాజును ఒప్పించే బాధ్యతను అతని మాజీ ప్రేయసి మీనాక్షి తీసుకుంటుంది. మరి ఆ తర్వాత ఏమైంది? పోలీస్‌ వ్యవస్థపై కోపంతో ఉద్యోగాన్ని వదిలేసిన రాజును ఈ ఆపరేషన్‌ కోసం మీనాక్షి ఎలా ఒప్పించింది? తన భర్త ప్రేమ విషయం తెలిసి ఆ ఆపరేషన్‌కు పంపించడానికి భాగ్యం (ఐశ్వర్య రాజేశ్‌) ఎలా ఒప్పుకొంది? వీళ్లు ముగ్గురు కలిసి చేసిన ఆపరేషన్‌లో ఎదురైన సవాళ్లేంటి? అన్నది మిగిలిన కథ.

Updated Date - Feb 22 , 2025 | 05:13 PM