Sritej Health Bulletin: శ్రీతేజ్ ఆరోగ్యంలో మార్పు.. కానీ
ABN , Publish Date - Jan 29 , 2025 | 08:51 PM
Sritej Health Bulletin:థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యంలో మార్పు వచ్చింది. తాజాగా కిమ్స్ డాక్టర్లు శ్రీతేజ్ పరిస్థితిని వివరించారు.
గతేడాది డిసెంబర్ 4న 'పుష్ప 2' ప్రీమియర్ షోలో భాగంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళా మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్(9) తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. బాలుడికి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాలుడి ఆరోగ్యంపై ఓ అప్డేట్ వచ్చింది. ఏంటంటే..
తాజాగా సికింద్రాబాద్ కిమ్స్ డాక్టర్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. ఇప్పుడు కాస్త మెలుకువగా ఉంటున్నాడు కానీ.. వారి కుటుంబ సభ్యులను గుర్తించలేకపోతున్నాడని డాక్టర్లు తెలిపారు. అలాగే ఎవరైనా పలకరిస్తే ప్రతిస్పందన లేదని చెప్పారు. ఇప్పటికే ఇండస్ట్రీ నుండి రూ. 2 కోట్ల నష్ట పరిహారాన్ని అందించారు. అలాగే ఈ మున్ముందు ఎలాంటి రకమైన సాయాన్ని అందిచడటానికి సిద్ధంగా ఉన్నట్లు అల్లు ఫ్యామిలీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో 'పుష్ప 2' నటుడు అల్లు అర్జున్ ని కోర్టు A 11గా తేల్చింది. అనంతరం జైలు శిక్ష కూడా విధించగా ఒక్క రోజులోనే బెయిల్ తో బయటకొచ్చాడు. ఈ కేసును అల్లు అర్జున్ తరుపు న్యాయవాది, నిర్మాత నిరంజన్ రెడ్డి డీల్ చేశారు.
ఎలా జరిగిందంటే
అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ప్రీమియర్ షోను గతేడాది డిసెంబర్ 4వ తేదీన హైదారాబాద్ సంధ్య థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా బన్నీ అక్కడికి వెళ్లారు. అయితే ఆయన వస్తున్నట్లు ముందుగానే అభిమానులకు సమాచారం వెళ్లడంతో థియేటర్ వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు. అల్లు అర్జున్ రాగానే అతనిని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన రేవతి మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు.