Sandeep Reddy Vanga: సాయి పల్లవి గురించి అలా అనుకుంటే తప్పే..

ABN , Publish Date - Feb 03 , 2025 | 08:39 AM

'తండేల్‌' (Thandel) సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక నిరాడంబరంగా జరిగింది. అభిమానులు, ప్రేక్షకులు లేకుండానే కేవలం సినిమా యూనిట్‌ నడుమ జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి బన్నీ అతిథిగా రావాల్సి ఉంది

'తండేల్‌' (Thandel) సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక నిరాడంబరంగా జరిగింది. అభిమానులు, ప్రేక్షకులు లేకుండానే కేవలం సినిమా యూనిట్‌ నడుమ జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి బన్నీ అతిథిగా రావాల్సి ఉంది అయితే ఆయన విదేశాల నుంచి రావడం, కాస్త ఆరోగ్యం బాగోకపోవడంతో ఆయన రాలేకపోయారు. సందీప్‌ రెడ్డి వంగా (Sandeep reddy Vanga) అతిథిగా హాజరు అయ్యారు. ఈ వేడుకలో అల్లు అరవింద్‌(Allu Aravind), నాగచైతన్య, సాయిపల్లవి (Sai pallavi) సందడి చేశారు. ఇటీవల విడుదలై హిట్టైన హైలెస్సో సాంగ్‌ స్టెప్పులేసి ఆహుతులను ఉర్రూతలూగించారు.

దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా మాట్లాడుతూ ‘‘ట్రైలర్‌, పాటలు భావోద్వేగంగా కనెక్ట్‌ అవుతున్నాయి. చైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ చూస్తే నిజమైన వ్యక్తులుగా అనిపిస్తారు. నటీనటులు అలా కనిపించిన ప్రతి సినిమా మంచి విజయం సాధించింది. ‘అర్జున్‌రెడ్డి’కి హీరోయిన్‌ గురించి ఆలోచిస్తున్నప్పుడు సాయిపల్లవి పేరు ప్రస్తావనకి వచ్చింది. ఆమె మీరు అనుకున్న పాత్రలోనే కాదు, స్లీవ్‌లెస్‌లో కూడా కనిపించరని ఓ కో ఆర్డినేటర్‌ చెప్పారు. మొదట అలాగే ఉంటారు, ఆ తర్వాత అవకాశాలు వస్తే చేస్తారు కదా అనుకున్నా. కానీ ఇప్పటికీ ఆమెలో మార్పు లేదు. బన్నీ వాస్‌ ఈ కథని నాకు ఇదివరకే  చెప్పారు. చాలా బాగుంది. అక్కినేని అభిమానులకు ఇదొక పండగలా ఉంటుంది’’ అన్నారు.


ఈ సందర్భంగా నాగచైతన్యను (Naga Chaitanya) అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా ‘‘ఇంట్లో శోభితని బుజ్జితల్లి అనే పిలుస్తుంటా. ఈ సినిమాలో కథానాయికనీ అలాగే పిలుస్తుంటా’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘శ్రీకాకుళం జిల్లాకి చెందిన మత్స్యలేశం గ్రామ ప్రజలే ఈ సినిమాకి నిజమైన హీరోలు.. వాళ్లు లేకుండా ఈ సినిమా లేదు. అద్భుతమైన కథ, కథనాలతో ఈ చిత్రం తప్పకుండా అలరిస్తుంది. ఈ వేడుకకు అతిథిగా వచ్చిన సందీప్‌రెడ్డి వంగాకు థ్యాంక్స్‌. తన సినిమాలే కాదు, సందీప్‌ వంగా ఇంటర్వ్యూల్లో మాటలుకూడా ఎంతో నిజాయతీగా ఉంటాయి. ఈ దర్శకులతో, ఈ నిర్మాతలతో కలిసి సినిమా చేయాలని ప్రతి నటుడి దగ్గర ఓ జాబితా ఉంటుంది. అలాంటి నా జాబితాలో గీతా ఆర్ట్స్‌ పేరు మొదట్లో ఉంటుంది.  బన్నీ వాస్‌తో నా ప్రయాణం ఎప్పట్నుంచో మొదలైంది. ఒక రోజు ఈ కథ గురించి మాట్లాడుకున్నాం. కథ సిద్ధమయ్యాక కచ్చితంగా నా దగ్గరికి రావాలని చెప్పా. చెప్పినట్టే వచ్చారు. ‘తండేల్‌’ రాజు పాత్రకీ, నా నిజ జీవితానికీ చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ ఈ పాత్రకి తగ్గట్టుగా మారిపోవడానికి నాకు కావల్సినంత సమయం ఇచ్చారు. నా గురించి నాకంటే ఎక్కువగా ఆలోచించే దర్శకుడు చందు. ఇప్పటివరకు మేం ఎక్కడికి వెళ్లినా సాయి పల్లవి తో కలిసి పనిచేయాలని చెబుతారు. ఇలాంటి నటిని నేను చూడలేదు. ఈ సినిమాకి నిజమైన రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌. బుజ్జి తల్లి పాటతో విడుదలకి ముందే ప్రేక్షకుల్లోకి సినిమాని తీసుకెళ్లారు’’ అని అన్నారు.

సాయి పల్లవి మాట్లాడుతూ ‘‘ మత్స్యలేశం ప్రజల సినిమా ఇది. ఓ దర్శకుడు నన్నొక పాత్రలో ఊహించుకోవడం ప్రత్యేకమైన విషయం. చందు మనసులో ఉన్న సత్య పాత్రని అదే తరహాలోనే తెరపైకి తీసుకొచ్చారు. నాగచైతన్య ఈ సినిమా కోసం తనని తాను మలుచుకున్న తీరు  బాగుంది.అన్నారు.


నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ నిర్మించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Updated Date - Feb 03 , 2025 | 08:43 AM