Vibe: సందీప్ కిషన్ అవుట్... రాజా గౌతమ్ ఇన్
ABN , Publish Date - Mar 03 , 2025 | 01:41 PM
బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ తో 'బ్రహ్మా ఆనందం' చిత్రాన్ని నిర్మించిన రాహుల్ యాదవ్ నక్కా... ఇప్పుడు మరో సినిమా నిర్మిస్తున్నాడు. సందీప్ తో మొదలు పెట్టిన 'వైబ్' మూవీని ఇప్పుడు రాజా గౌతమ్ తో తీస్తున్నాడు.
ప్రముఖ నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా (Rahul Yadav Nakka) ... నిజంగానే నక్క తోక తొక్కాడేమో అని సినిమా జనం మొన్నటి వరకూ అనుకున్నారు. ఆయన నిర్మించిన మొదటి మూడు చిత్రాలు 'మళ్ళీ రావా (Malli Raava), ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (Agent Sai Srinivasa Atreya), మసూద (Masooda)' చక్కని విజయాలను అందుకుని, హ్యాట్రిక్ ప్రొడ్యూసర్ అనే పేరు తెచ్చిపెట్టాయి. అయితే... అన్ని రోజులూ ఒకేలా ఉండవని 'బ్రహ్మా ఆనందం' (Brahma Anandam) మూవీ ఫలితం నిరూపించింది. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం (Brahmanandam), ఆయన తనయుడు రాజా గౌతమ్ (Raja Goutam) తాత మనవళ్ళుగా నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలై... పరాజయం పాలైంది. బ్రహ్మానందం, తాళ్ళూరి రామేశ్వరి మధ్య రొమాన్స్ ను జనం తట్టుకోలేకపోయారు. 'వెన్నెల' కిశోర్ (Vennela Kishore) తన వంతుగా మాగ్జిమమ్ ఎంటర్ టైన్ మెంట్ ను ఇవ్వడానికి ప్రయత్నించినా... ఫలితం లేకపోయింది.
'బ్రహ్మా ఆనందం' సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా... రాజా గౌతమ్ కు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మరో అవకాశం ఇచ్చారు. ఇప్పటికే ఆయన సందీప్ కిషన్ తో 'వైబ్' అనే సినిమాను నిర్మి్స్తున్నట్టు ప్రకటించారు. దాని ఫస్ట్ లుక్ పోస్టర్ ను సైతం విడుదల చేశారు. ఈ కాలేజ్ బేస్డ్ యాక్షన్ లవ్ స్టోరీని ఇప్పుడు రాజా గౌతమ్ తో తీస్తున్నారు. దీనికి సంబంధించిన చిన్నపాటి గ్లింప్స్ ను మార్చి 2 రాజా గౌతమ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. ఇందులోంచి సందీప్ కిషన్ తప్పుకున్నాడని కానీ... ఆ స్థానంలో రాజా గౌతమ్ ను తీసుకున్నామని గానీ మేకర్స్ తెలియచేయలేదు. 'వైబ్' మూవీని 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె. డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం 'మజాకా' (Mazaka) సైతం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. మరి ఇప్పుడు సందీప్ స్థానంలోకి వచ్చిన రాజా గౌతమ్ 'వైబ్'తో అయినా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.
Also Read: Vicky Kaushal: 'ఛావా' తెలుగు ట్రైలర్ విడుదల
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి