Revanth Reddy: 'దావోస్'లో పుష్పరాజ్ ప్రస్తావన..
ABN , Publish Date - Jan 23 , 2025 | 10:57 AM
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అల్లు అర్జున్ ఇష్యుపై రియాక్ట్ కావాల్సి వచ్చింది. మొదట నేషనల్ మీడియా ముందు మాట్లాడిన ఆయన ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా ముందు మాట్లాడటంతో అల్లు అర్జున్ పరిస్థితి 'పుష్ప 2' సినిమాలో "పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్" అనే డైలాగ్ మాదిరి మారింది.
కొన్ని రోజుల క్రితం వరకు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఎంత సెన్సేషనల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఘటన కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. నేషనల్ మీడియాలో కూడా విస్తృత చర్చ జరిగింది. ఇప్పుడు అంత సద్దుమనిగింది అనుకున్న నేపథ్యంలో అంతర్జాతీయ మీడియా ఈ చర్చను లేవనెత్తడం ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం అల్లు అర్జున్ పరిస్థితి 'పుష్ప 2' సినిమాలో డైలాగ్ మాదిరి మారింది. "పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్" అనే డైలాగ్ గుర్తుంది కదా! ఓకే ఇప్పుడు ఇదంతా ఎందుకు? అసలు ఏమైంది అంటారా. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. అక్కడి మీడియాతో ఆయన సంభాషిస్తుండగా.. ఓ ఆంగ్ల పత్రిక ప్రతినిధి 'తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు ఎలా అవుతారని ప్రశ్నించారు.
దీనికి రేవంత్ సమాధానమిస్తూ.. ‘‘రెండు రోజుల ముందు అనుమతి కోసం వస్తే.. పోలీసులు నిరాకరించారు. అయినా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఈ క్రమంలో భారీగా అభిమానులు తరలిరావడంతో ఆయనతో వచ్చిన సెక్యురిటీ సిబ్బంది అక్కడున్న వారిని తోసేశారు. ఆ తొక్కిసలాటలో ఒకరు చనిపోయారు. ఒక మనిషి చనిపోవడమన్నది ఆయన చేతుల్లో లేకపోవచ్చు. ఒక మహిళ చనిపోతే, 10-12 రోజులు బాధిత కుటుంబాన్ని పట్టించుకోలేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది’’ అంటూ సమాధానమిచ్చారు. మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ కరెక్ట్ కాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు కదా అని మరో ప్రతినిధి ప్రశ్నించగా.. రేవంత్ సమాధానమిస్తూ.. అప్పటికి చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంపై అవగాహన ఉండకపోవచ్చని చెప్పారు. ఈ విధంగా ఈ ఇష్యు నేషనల్ నుండి ఇంటర్నేషనల్ అయ్యింది.