Gayatri bhargavi: గుండెలదురుతూనే సాగనంపాను
ABN , Publish Date - Jan 26 , 2025 | 07:54 AM
విక్రమ్ సుబ్రహ్మణ్యం... మావారు. ఆర్మీలో రెండో తరానికి చెందినవారు. మా మామయ్యగారు, ఆడపడుచు కూడా సైన్యంలో పని చేశారు. హిమనీనదాల దగ్గరకు వెళ్లిన తొలి బృందాల్లో మావారు కూడా ఉన్నారు - గాయత్రి భార్గవి.
కల్నల్‌తో కాపురమంటే ఎడబాట్లు, త్యాగాలూ తప్పవు. నిరంతరం ప్రమాదాలతో చెలగాటాలూ తప్పవు. అయినా, ఆ వృత్తిని భర్తతో సమానంగా ప్రేమించడంతో పాటు, అటు కుటుంబానికీ, ఇటు నటనా జీవితానికీ సమ న్యాయం చేస్తున్నారు ‘లక్కీ భాస్కర్’ చిత్రంలో నటించిన గాయత్రి భార్గవి(Gayatri bhargavi). గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమె ‘నవ్య’తో పంచుకున్న జీవితానుభావాలివి...
మాది హైదరాబాదే! ప్రస్తుతం కుటుంబమంతా ఇక్కడే ఉంది. మాకు ఇద్దరు మగ పిల్లలు. పెద్ద బాబు అక్షజ్ భావిక్‌కు 18 ఏళ్లు. చిన్న బాబు కృతిక్ భావిక్‌కు ఎనిమిదేళ్లు. పెళ్లయ్యే నాటికి డిగ్రీ వరకే చదివినా, పెళ్లి తర్వాత చదువును కొనసాగించి ఎమ్‌ఎ, ఎమ్‌ఫిల్ చేయగలిగాను. అదే సమయంలో టివిలో కూడా పని చేశాను. భోపాల్, అసోం, బెంగుళూరు... ఇలా విక్రమ్‌తో ఎక్కడకు వెళ్లినా ఆ ప్రాంతాల్లోని అనాథాశ్రమాలకు వెళ్లి పిల్లలకు ఉచితంగా చదువు చెప్పేదాన్ని. ఆయన కూడా తన తీరిక సమయాల్లో పిల్లలకు గణితం బోధించేవారు.
‘లక్కీ భాస్కర్’తో (Lucky Bhaskar) నాకు మంచి గుర్తింపు వచ్చింది. హీరోయిన్ మీనాక్షిది కూడా సైనిక కుటుంబమే! దాంతో మేమిద్దరం వెంటనే కలిసిపోయాం. సినిమా చివరివరకూ నేనెంతో ఎంజాయ్ చేశాను. మా అబ్బాయి దుల్కర్ సల్మాన్ అభిమాని. దాంతో షూటింగ్ సమయంలో మా వారు బాబును వెంటబెట్టుకుని సెట్‌కు వచ్చారు. ఆయనకు మా ప్రొడక్షన్ భోజనం తినిపించాం. ఆ వాతావరణాన్ని ఆయన చాలా బాగా ఎంజాయ్ చేశారు. (Chitchat with Gayatri bhargavi)
విక్రమ్ సుబ్రహ్మణ్యం... (Gayatri bhargavi) మావారు. ఆర్మీలో (Army Family) రెండో తరానికి చెందినవారు. మా మామయ్యగారు, ఆడపడుచు కూడా సైన్యంలో పని చేశారు. హిమనీనదాల దగ్గరకు వెళ్లిన తొలి బృందాల్లో మావారు కూడా ఉన్నారు. అప్పటివరకూ యుద్ధ సమయంలో తప్ప సైనికులెవరూ అక్కడకు వెళ్లేవారు కారు. పాకిస్తాన్, భారత్ సరిహద్దులోని హిమాలయ ప్రాంతంలో ఆరు నెలల గడపడం మొదలుపెట్టిన మొదటి బృందాలతో ఆయన కూడా వెళ్లారు. అప్పట్లో అక్కడ ఎలాంటి సదుపాయాలూ ఉండేవి కావు. ఉత్తరాలే ఏకైక కమ్యూనికేషన్. దాంతో మేమందరం ఆయనకు ఉత్తరాలు రాసేవాళ్లం. మేం రాసిన ఉత్తరం ఆయనకు చేరడానికి 15 రోజులు పడుతుంది. అయితే అప్పట్లో ఆయనకు నేనొక మంచి స్నేహితురాలిని మాత్రమే! చెన్నైలోని మా కజిన్ క్లాస్‌మేట్ ఆయన. అలా ఆయనతో పరిచయం ఏర్పడింది. ఓ సందర్భంలో ఆయన హైదరాబాద్ వచ్చారు. విక్రమ్‌కు హైదరాబాద్‌లో స్నేహితులు లేరు కాబట్టి కంపెనీ ఇవ్వమని మా కజిన్ అడగడంతో ఒకట్రెండు సార్లు కలిశాను. అలా మా స్నేహం మరింత పెరిగింది. అది ప్రేమగా మారిందనే విషయం, కలిసి ‘బార్డర్’ సినిమాకు వెళ్లినప్పుడు తెలిసింది. సినిమాలో సైనికుల కష్టాలు చూసి నేను కళ్లనీళ్లు పెట్టుకుంటూ ఉంటే, ఆయనేమో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ అప్పటికి నేనింకా చిన్నదాన్ని. ఇంట్లో ఒప్పుకోరని అభ్యంతరం చెప్పాను. ఆ తర్వాత చాలా కాలం పాటు మా మధ్య ఉత్తరాలు, ఫోన్ కాల్స్ కొనసాగాయి. ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసేనాటికి ఆయన ఒక కోర్సు కోసం హైదరాబాద్ ఈమ్‌ఇ సెంటర్‌కి వచ్చి ఇక్కడే మూడేళ్లు ఉండిపోయారు. ఆ సమయంలో పెద్దల అంగీకారంతో (Gayathri Bhargavi Love MArriage))మేమిద్దరం 2004లో పెళ్లితో ఒక్కటయ్యాం.
ఆ కొరతలు తప్పవు
సైనికుడి భార్యగా ఆయనతో నాకున్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి. సగటు మహిళల్లాగే భర్తతో కలిసి కుటుంబ వేడుకలు, పండుగలు జరుపుకోవాలని నేనూ ఆశపడుతూ ఉంటాను. కానీ అలా అన్నిసార్లూ సాధ్యపడేది కాదు. టూర్లూ, షికార్లూ వీలుపడేవి కావు. పిల్లల పుట్టినరోజులు కూడా ఆయన లేకుండా జరుపుకోవలసి వస్తూ ఉండేది. అయితే పెళ్లికి ముందే సైనికుల జీవితాల పట్ల కొంత అవగాహన ఉండడంతో నేనెప్పుడూ దాన్నొక కొరతగా భావించలేదు. దేశాన్ని కాపాడే బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న విక్రమ్ అంటే నాకెంతో గౌరవం. ఆయన మాతో కలిసి ఉండే కొద్ది రోజులూ ఆనందంగా గడుపుతూ ఉంటాం. ఆయన అప్పుడప్పుడూ తన సైనిక అనుభవాలను నాతో పంచుకునేవారు. అయితే ముఖ్యమైన విషయాలే తప్ప తాను పాల్గొనే కొన్ని రహస్య మిషన్స్ గురించి చర్చించేవారు కారు. కొన్ని సందర్భాల్లో తనకెదురైన ప్రమాదకరమైన సంఘటల గురించి చాలా కాలం తర్వాత ఎంతో తాపీగా, యధాలాపంగా చెప్పేవారు. ఆయన చెప్తున్న విషయాలు విన్నప్పుడు గుండె ఝల్లుమనేది. ఓ సందర్భంలో హిమపాతం నుంచి తృటిలో తప్పించుకున్నాననీ, మరో సందర్భంలో చెవి పక్క నుంచి తుపాకీ గుండు దూసుకువెళ్లిందనీ నాతో చెప్పారు. ఇలాంటివి విన్నప్పుడు ఒక సగటు భార్యగా భయాందోళనకు లోనయ్యేదాన్ని.
అదే చివరిసారి అనుకున్న సందర్భం
సైనికుల భార్యల జీవితాలు తీగ మీద నడక చందం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇక ఆయనను చూడడం ఇదే చివరిసారి అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పటికి మా పెళ్లై ఆరు నెలలు. ఓ రోజు అకస్మాత్తుగా సైన్యం నుంచి ఆయనకు పిలుపొచ్చింది. రాత్రికి రాత్రే సైనికులందరూ వెళ్లిపోయారు. వెళ్లినవాళ్లు ప్రాణాలతో తిరిగొస్తారనే నమ్మకం లేదు. పాస్‌పోర్టులు, బ్యాంక్ పాస్‌బుక్స్ చేతికి అందించి, తిరిగి రాకపోతే ఏం చేయాలో వివరిస్తుంటే విపరీతంగా భయపడిపోయాను. సినిమాల్లో తప్ప, నిజ జీవితంలో సైనికుల జీవితాలు ఎలా ఉంటాయో ఏమాత్రం అవగాహన లేని నేను గుండెలదురుతూనే ఆయనను సాగనంపాను. అయితే సినిమాల్లోలా సైనికులను ఏడుస్తూ సాగనంపే సన్నివేశాలు నిజ జీవితంలో ఉండవు. సంతోషంగా హారతిచ్చి, బొట్టు పెట్టి పంపిస్తాం. భయం, బాధ ఉన్నా, వాటిని మనసులోనే దాచుకుని దేశ ప్రజల భద్రత కోసం ప్రాణాలకు తెగిస్తున్న భర్తలను హుందాగా సాగనంపుతాం! వాళ్లు వెళ్లిపోయిన తర్వాత సైనికుల భార్యలుగా మేమందరం ఎంతో బాధ్యతగా నడుచుకుంటాం! పిల్లలూ, పెద్దల బాగోగులు చూసుకోవడంతో పాటు కంటోన్మెంట్లలోని జవాన్ల భార్యాపిల్లలను చూసుకోవలసిన బాధ్యత కూడా పైఅధికారుల భార్యలకు ఉంటుంది. కల్నల్ భార్యగా నేనలాంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటాను. మేమందరం ఒకే కుటుంబంలా కలిసిమెలసి జీవిస్తూ ఉంటాం.