Renu Desai: అకీరా ఎంట్రీపై నాకు ఆతృత.. రేణు దేశాయ్

ABN , Publish Date - Jan 05 , 2025 | 02:26 PM

Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ సినీ ఎంట్రీపై ఉత్కంఠ రేకెత్తుతున్న వేళా.. రేణు దేశాయ్ ఫ్యాన్స్ కి నోట్లో పంచదార పోసినట్లు అనిపించే న్యూస్ చెప్పారు. ఇంతకీ ఆమె ఏమన్నారు అంటే..

Renu Desai With Akira Nandan

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి రావాలని తానూ కోరుకుంటున్నట్లు సినీ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai) తెలిపారు. అకీరా నందన్ (Akira Nandan) సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడోనని తల్లిగా తనకూ ఆతృత ఉన్నట్లు రేణు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం (Narendrapuram)లో ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో రేణు దేశాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థకు చెందిన ఐదు రకాల కొత్త ఉత్పత్తులను మేనేజింగ్ డైరెక్టర్ జొన్నాడ శ్రీధర్‌తో కలిసి ఆమె ప్రారంభించారు.


ఈ సందర్భంగా నటి రేణు దేశాయ్ మీడియాతో మాట్లాడారు. "అకీరా నందన్ ఎప్పుడు సినిమాల్లోకి వస్తారోనని పవన్ కల్యాణ్ అభిమానులు, మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆ ఆతృత నాకూ ఉంది. అకీరా నందన్ తన ఇష్టపూర్వకంగానే సినీ రంగ ప్రవేశం చేస్తారు. గోదావరి జిల్లాల్లాంటి అందమైన లొకేషన్స్ నేనెక్కడా చూడలేదు. విజయవాడ నుంచి రాజమండ్రి మధ్య పచ్చని పొలాలు చూసేందుకు రెండు కళ్లూ సరిపోలేదు.


తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు రావాలని సినీ పెద్దలు ప్రకటించారు. ఏపీలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందితే నాకూ సంతోషమే. నాకు చిన్నప్పటి నుంచీ మూగజీవాల సంరక్షణ పట్ల ఆసక్తి ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల కోసం నా కుమార్తె ఆద్య పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేశా. ప్రొడక్ట్‌ను నమ్మితేనే నేను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటా. పిల్లలకు ఇడ్లీ, ఉప్మా కంటే మంచి ఆహారం మరొకటి లేదు. ఫారెన్ ఆహారాలు కంటే ఆంధ్ర పెసరట్టు ఎంతో మేలు" అని చెప్పారు.

Updated Date - Jan 05 , 2025 | 02:30 PM