Thandel Real Story: సంవత్సరం పైగా పాకిస్థాన్‌లో మగ్గిపోయాం
ABN , Publish Date - Feb 04 , 2025 | 09:42 AM
Thandel Real Story: సినిమా, వాస్తవికతకు చాలా బేధాలు ఉంటాయి. మరి హీరో నాగ చైతన్య నటిస్తున్న 'తండేల్' స్టోరీ ఏంటో మీకు తెలుసా? అసలైన 'తండేల్' ఎవరు? ఆయన మాటల్లోనే చూడండి.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం 'తండేల్'. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘బుజ్జి తల్లి, శివ శక్తి, హైలెస్సో హైలెస్సా’ పాటలు మ్యూజిక్ చార్టులలో టాప్ ప్లేస్‌లో, అలాగే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. కాగా, తండేల్ సినిమా టైటిల్ అందరిని చాల ఆకట్టుకుంటుంది. ఈ కథను స్క్రీన్ పై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చుస్తునారు. మరి రియల్ లైఫ్ తండేల్ కథ ఎంత మందికి తెలుసు..
‘తండేల్’ చిత్రం వాస్తవ ఘటనల ఆధారంగా తెరెకెక్కించిన విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రియల్ ‘తండేల్’ రామారావుతో మాట్లాడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘తండేల్ అంటే లీడర్ అని అర్థం. మిగతా జాలరులు అందరూ తండేల్ ను అనుసరిస్తారు. ఎన్ని ఎక్కువ చేపలు పడితే అంత పేరు వస్తుంది. వేటకు వెళ్లేముందు ఇదే లాస్ట్ ట్రిప్ అని నా భార్యకు చెప్పి వెళ్లాను. అప్పుడు ఆమె ఏడు నెలల గర్భంతో ఉంది. 29 రోజులు సముద్రంలో వేట బాగానే సాగింది. అయితే వెనక్కి తిరిగి రావాలని అనుంటున్నప్పుడు అనుకోకుండా పాకిస్థాన్ సముద్ర జలాల్లోకి వెళ్లిపోయాం. దీంతో గుండెజారిపోయినంత పనైంది. పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ కి చిక్కి జైలుకు వెళ్లినప్పుడు బాగా ఏడ్చేశాం. దాదాపు అక్కడే 17 నెలలపాటు మగ్గిపోయాం. అయితే ధైర్యంగా పోరాడాం. కాబట్టే పాకిస్తాన్ జైలు నుంచి బయటకు వచ్చాం’ అని చెప్పారు.
వినోదం కూడా..
మరోవైపు ‘తండేల్’ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొన్నారట మేకర్స్. టీజర్, ట్రైలర్‌లలో ఎమోషన్ కంటెంట్ ఎక్కువగా చూపించారు. వినోదానికి, నవ్వులు పూయించడానికి పెద్దగా స్కోప్ లేని కథ ఇది. సినిమా అవుట్‌పుట్ అంతా చూశాక ఎక్కడో సీరియస్ సినిమా అనే స్మెల్ కొట్టడంతో చివర్లో కొన్ని సరదా సన్నివేశాల్ని యాడ్ చేసి, షూట్ చేశారని సమాచారం. ఏ సినిమాకేౖనా ఇలాంటి జోడింపులు సహజంగా జరుగుతుంటాయి. పైగా తండేల్‌కు కావల్సినంత సమయం ఉంది. డిసెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు. సంక్రాంతి రేసులోనూ తండేల్ పేరు వినిపించింది. కానీ చివరికి ఫిబ్రవరి 7 కు వాయిదా పడింది. ఈలోపు కావాల్సినంత రిపేర్ చేసుకునే సమయం దొరికింది. సో దీంతో సినిమాలో వినోదాన్ని జోడించారని తెలిసింది.