Rashmika Mandanna: ఇంకేం కావాలి.. రిటైర్మెంట్ తీసుకుంటా
ABN , Publish Date - Jan 23 , 2025 | 02:27 PM
Rashmika Mandanna: నటి రష్మిక మందన్న తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడటం వైరల్‌గా మారింది. చేతిలో ఆరు ప్రాజెక్టులు పెట్టుకొని రిటైర్ కావడం ఏంటని అనుకుంటున్నారా? ఇంతకీ ఏం జరిగిందంటే
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఛావా’. ‘మిమి’, ‘చుప్పి’ ఫేమ్ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో నటించింది రష్మిక. తాజాగా ముంబైలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఈ ఈవెంట్ లో రష్మిక మాట్లాడుతూ.."ఈ సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయిగా కనిపించే అవకాశం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఒక నటిగా ఇంతకు మించి ఏం కావాలి. ఈ సినిమా తర్వాత నేను ఎంతో సంతోషంగా రిటైర్ అవ్వగలను అంటూ డైరెక్టర్‌తో ఒకసారి చెప్పాను. ఇది అంత గొప్ప పాత్ర. దీని షూటింగ్ సమయంలో ఎన్నో సార్లు ఎమోషనల్ అయ్యాను. ట్రైలర్ చూశాక కూడా అలానే జరిగింది. విక్కీ ఇందులో నాకు దేవుడిలా కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ నన్ను అప్రోచ్ అయినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయా. ఏమీ ఆలోచించకుండా వెంటనే అంగీకరించా. ఈ పాత్ర కోసం ఎన్నో రిహార్సల్స్ చేశా. టీమ్ అంతా ఎంతో సహకరించింది. ఇందులోని పాత్రలు అందరినీ ప్రభావితం చేస్తాయి" అని చెప్పారు.
మరోవైపు ఆమె ఇటీవల జిమ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. దీంతో ఆమె ఈవెంట్ కి గాయంతోనే అటెండ్ అయ్యారు. ఆమెకు నటుడు విక్కీ కౌశల్ సహాయం అందించాడు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.