Brahmanandam: బ్రహ్మానందం కొడుక్కి కలిసిరాని నయా సాల్

ABN , Publish Date - Feb 17 , 2025 | 02:43 PM

బ్రహ్మానందం పెద్ద కొడుకు రాజా గౌతమ్  తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ నటుడిగా సినిమాల్లో చేస్తుంటే... చిన్న కొడుకు సిద్ధార్థ్‌ దర్శకత్వ శాఖలో రాణించేందుకు కృషి చేస్తున్నాడు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం (Brahmanandam) అత్యధిక చిత్రాలలో నటించిన హాస్యనటుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు దక్కించుకున్నారు. ఆయన పెద్ద కొడుకు రాజా గౌతమ్ (Raja Gowtham) తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ నటుడిగా సినిమాల్లో చేస్తుంటే.. చిన్న కొడుకు సిద్ధార్థ్‌ (Siddharth) దర్శకత్వ శాఖలో రాణించేందుకు కృషి చేస్తున్నాడు. రాజా గౌతమ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్రీనివాసరెడ్డి కుమార్తె ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. తన మనవడికి అన్నీ వాళ్ళ తాత పోలికలే వచ్చాయని, సెల్ ఫోన్ లో ఫోటోలను అద్భుతంగా తీస్తుంటాడని బ్రహ్మానందం ఆ మధ్య అన్నారు. ఇదిలా ఉంటే... రాజా గౌతమ్ మాత్రం ఇరవై యేళ్ళు గడిచినా సరైన బ్రేక్ రాక ఇంకా తడబడుతూనే ఉన్నాడు.

అప్పుడెప్పుడో 2004లో అతని మొదటి సినిమా 'పల్లకిలో పెళ్ళికూతురు' (Pallaki lo Pellikoothuru) విడుదలైంది. డాన్స్ మాస్టర్ సుచిత్ర (Suchitra) దర్శకురాలిగా పరిచయం అయిన ఈ మూవీకి కె. రాఘవేంద్రరావు (K. Ragahvendra Rao) దర్శకత్వ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత మాత్రం రాజా గౌతమ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ కే ప్రాధాన్యమిస్తూ వచ్చాడు. నటుడిగా అతనికి ఇందులో కొన్ని సినిమాలు పేరు తెచ్చిపెట్టినా కమర్షియల్ సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయాడు.


ఈ యేడాది పరిస్థితి మరీ దారుణం. రాజా గౌతమ్ మూడేళ్ళ క్రితం చేసిన 'బ్రేక్ అవుట్' (Breakout) మూవీ థియేటర్ లో విడుదల కాలేదు. ఎట్టకేలకు ఈ యేడాది జనవరి 9న ఇది ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అయ్యింది. అయితే... సినిమాలో అత్యధిక సమయం రాజా గౌతమ్ మాత్రమే ఉండటం.... మిగిలిన రెండు మూడు పాత్రలు జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో ప్రేక్షకులు దీనిని ఎంజాయ్ చేయలేకపోయారు. ఈ సర్వైవైల్ థ్రిల్లర్ ను సుబ్బు చెరుకూరి డైరెక్ట్ చేశాడు. ఇది సినిమాకు తక్కువ... షార్ట్ ఫిల్మ్ కు ఎక్కువ అన్నట్టుగా ఉంది. ఓటీటీ వీక్షకులు సైతం 'బ్రేక్ అవుట్' ను చూసి పెదవి విరిచారు.

ఇదిలా ఉంటే... తాజాగా రాజా గౌతమ్ నటించిన 'బ్రహ్మా ఆనందం' (Brahma Anandam) మూవీ ఫిబ్రవరి 14న విడుదలైంది. దీన్ని హ్యాట్రిక్ మూవీస్ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కా (Rahul Yadav Nakka) నిర్మించాడు. ఈ మూవీతో ఆర్.వి.ఎస్. నిఖిల్ (RVS Nikhil) దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇందులో బ్రహ్మానందం, రాజా గౌతమ్ తాతామనవళ్ళుగా నటించడం విశేషం. ఇతర ప్రధాన పాత్రలను 'వెన్నెల' కిశోర్ (Vennela Kishore) , తాళ్ళూరి రామేశ్వరి (Talluri Rameswari), ప్రియా వడ్లమాని (Priya Vadlamani), ఐశ్వర్య హోలక్కల్, సంపత్ రాజ్ (Sampath Raj), రాజీవ్ కనకాల (Rajeev Kanakala) తదితరులు పోషించారు. చిత్రం ఏమంటే... భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. రాజా గౌతమ్ లోని నటుడిని ఎలివేట్ చేయడం కోసమే 'బ్రేక్ అవుట్','బ్రహ్మా ఆనందం' సినిమాలను తెరకెక్కించినట్టు ఉంది తప్ప... సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకునే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. 'బ్రహ్మా ఆనందం'కు చక్కని స్పందన వస్తోందని బ్రహ్మానందం అండ్ టీమ్ చెబుతోంది కానీ అది కలెక్షన్ల రూపంలో కనిపించడం లేదు. మొత్తం మీద కొత్త సంవత్సరంలో వచ్చిన రాజా గౌతమ్ రెండు సినిమాలు అతని కెరీర్ ఎదుగుదలకు ఏ మాత్రం సహాయపడలేదు. మరి గౌతమ్ కెరీర్ ఊపందుకునేది ఎప్పుడో!?

Updated Date - Feb 17 , 2025 | 02:55 PM