Tollywood: పూరి జగన్నాథ్ రెండున్నర దశాబ్దాల ప్రస్థానం

ABN , Publish Date - Apr 21 , 2025 | 09:30 AM

బుల్లితెర నుండి వెండితెరపైకి వచ్చారు పూరి జగన్నాథ్. తొలి చిత్రం 'బద్రి'తోనే దర్శకుడిగా తనదైన మార్క్ ను సిల్వర్ స్క్రీన్ పై వేశారు. పాతికేళ్ళ పూరి ప్రస్థాన విశేషాలు ఇవి....

దర్శకునిగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh) వయసు పాతికేళ్ళు. ఆయన తొలి చిత్రం 'బద్రి' (Badri)2000 ఏప్రిల్ 20న జనం ముందు నిలిచింది, వారి మనసులు గెలిచింది. చదువుకొనే రోజుల నుంచీ సినిమాపిచ్చి ఉన్న పూరి జగన్నాథ్ డిగ్రీ కాగానే చిత్రసీమలో ప్రయత్నాలు మొదలెట్టారు. ఆరంభంలో రామ్ గోపాల్ వర్మ సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేశారు. అదే సమయంలో కొన్ని చిత్రాల్లో తళుక్కుమని తెరపై కనిపించారు. మొదటి నుంచీ వైవిధ్యం ప్రదర్శించాలని తపిస్తోన్న పూరి జగన్నాథ్ 'బద్రి' కథ తయారు చేసుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను కలిశారు. అప్పట్లో కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ సాగుతున్నారు పవన్. అంతకు ముందు కొత్త దర్శకులకు అవకాశాలిచ్చి పవన్ నటించిన "తొలిప్రేమ, తమ్ముడు" చిత్రాలు ఘనవిజయం సాధించాయి. అదే సమయంలో పూరి చెప్పిన 'బద్రి' కథ నచ్చడంతో పవన్ మరో మాట లేకుండా ఓకే చెప్పేశారు. అలా తొలిసారి పూరి జగన్నాథ్ మెగాఫోన్ పట్టుకున్నారు.


'బద్రి' సినిమా కథలో కొత్తదనం కన్నా కథనంలో నూతనత్వం కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచీ ప్రేమించుకున్న బద్రీనాథ్, వెన్నెల పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. బద్రి కన్నవారు కూడా వెన్నెలను చాలా ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. ఓ అందమైన అమ్మాయిని చూపించి, ఆమెను ప్రేమలోకి దించగలవా అంటూ వెన్నెల బద్రితో పందెం వేస్తుంది. అందుకు ఓకే చెప్పి బద్రి, సరయు అనే అమ్మాయిని ప్రేమలోకి దించుతాడు. బద్రిని సరయు ప్రేమించడం ఆమె అన్న నందాకు నచ్చదు. దాంతో బద్రి, నందా మధ్య గొడవ. చివరకు నందాకు వెన్నెల అసలు విషయం చెబుతుంది. తాను ఎంతో కాలం బ్రతకనని, అందువల్లే అలా పందెం వేశానని వివరిస్తుంది. బద్రి, సరయు ఒకటవుతారు. విదేశాలకు వెళ్తున్న వెన్నెలకు సెండాఫ్ ఇవ్వడంతో కథ ముగుస్తుంది. ఈ కథను పూరి జగన్నాథ్ నడిపిన తీరు ప్రేక్షకులను భలేగా ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే దర్శకునిగా మంచి మార్కులు సంపాదించుకున్నారు పూరి.

విజయలక్ష్మీ మూవీస్ పతాకంపై టి.త్రివిక్రమరావు (T.Trivikrama Rao) 'బద్రి' చిత్రాన్ని నిర్మించారు. రమణ గోగుల సంగీతం 'బద్రి'కి ఓ అసెట్. ఇందులోని జలీస్ షేర్వానీరాసిన "ఐ యామ్ ఏన్ ఇండియన్..." అంటూ సాగే గీతం అప్పట్లో యువతను విశేషంగా అలరించింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ పాటను జాతీయ పర్వదినాల్లో విశేషంగా ప్రసారం చేస్తూ ఆనందించారు. ఇక చంద్రబోస్ రాసిన "బంగాళా ఖాతంలో..." అంటూ సాగే పాట కూడా అలరించింది. మిగిలిన నాలుగు పాటలను వేటూరి రాశారు. అందులో "యే చికితా..." అంటూ మొదలయ్యే పాట భలేగా మురిపించింది. 'బద్రి' మంచి వసూళ్ళు చూసింది. అనేక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమాతో దర్శకునిగా పూరి జగన్నాథ్ పేరు మారుమోగింది.

'బద్రి' తరువాత పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'బాచి' సినిమాతో అంతగా మురిపించలేకపోయారు. అయితే 'బాచి'తో చక్రి (Chakri)ని సంగీత దర్శకునిగా పరిచయం చేశారు పూరి. 'బాచి' సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా చక్రి బాణీలు ఆకట్టుకున్నాయి. హిందీ సినిమా 'జో జీతా వహీ సికందర్'కు కొన్ని మార్పులూ చేర్పులూ చేసి తెలుగులో పవన్ కళ్యాణ్ తో అరుణ్ ప్రసాద్ 'తమ్ముడు' చిత్రం రూపొందించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అదే కథతో పూరి జగన్నాథ్ కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా 'యువరాజ' (YuvaRaja) తీశారు. ఆ చిత్రం పరవాలేదనిపించుకుంది. తరువాత తెలుగులో రవితేజ (Raviteja) హీరోగా పూరి రూపొందించిన 'ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం' మంచి విజయం సాధించింది. ఈ చిత్రం పూరిని యువతకు మరింత చేరువ చేసింది. కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా పూరి జగన్నాథ్ సొంతకథతో 'అప్పు' తెరకెక్కించారు. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలచింది. అదే కథను తెలుగులో పూరి జగన్నాథ్ రవితేజతో 'ఇడియట్'గా రీమేక్ చేశారు. తెలుగులో మరింత విజయం సాధించి, యూత్ ను కిర్రెక్కించింది 'ఇడియట్'. ఈ సినిమాతో రవితేజ స్టార్ హీరో అయిపోయారు. ఈ సినిమాలోని పాటలు జనాన్ని విశేషంగా అలరించాయి. ఇందులోని "చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే..." సాంగ్ కుర్రాళ్ళను కట్టిపడేసింది. తరువాత రవితేజ హీరోగా పూరి తెరకెక్కించిన 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' కూడా సూపర్ హిట్ గా నిలచింది. నాగార్జున హీరోగా పూరి తెరకెక్కించిన తొలి చిత్రం 'శివమణి' బంపర్ హిట్ అయింది. యంగ్ టైగర్ యన్టీఆర్ తో పూరి తీసిన తొలి చిత్రం 'ఆంధ్రావాలా' అంతగా మురిపించలేక పోయింది. 'బద్రి'ని హిందీలో పూరి దర్శకత్వంలోనే 'షర్త్ : ద ఛాలెంజ్'గా రీమేక్ చేశారు కానీ, అంతగా మురిపించలేదు. ఆ పై పూరి తన తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా '1 4 3' తీసినా, ఫలితం లేకపోయింది. 'బాచి' మొదలు 'ఆంధ్రావాలా' దాకా తెలుగులో తాను తీసిన సినిమాలకు చక్రి స్వరాలతో సాగిన పూరి జగన్నాథ్ 'సూపర్' సినిమాకు సందీప్ చౌతాను ఎంచుకున్నారు. ఇందులోని పాటలు బాగానే ఉన్నా, సినిమా పెద్దగా అలరించలేకపోయింది. ఈ సినిమాతోనే అనుష్క నటిగా పరిచయం కావడం విశేషం!


మహేశ్ బాబుతో పూరి రూపొందించిన తొలి చిత్రం 'పోకిరి' (Pokiri) అనూహ్య విజయం సాధించింది. ఈ సినిమా తెలుగునాట అప్పట్లో పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు మణిశర్మ బాణీలు భలేగా ఆకట్టుకున్నాయి. తరువాత అల్లు అర్జున్ తో పూరి మొదటి సినిమా 'దేశముదురు' (Desamuduru) రూపొంది, ఆ సినిమా సైతం యువతను భలేగా ఆకట్టుకుంది. ఈ చిత్రంతోనే హన్సిక తొలిసారి నాయికగా పరిచయం అయింది. రామ్ చరణ్ ను హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.అశ్వనీదత్ నిర్మించిన 'చిరుత' (Chirutha) అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ పై ప్రభాస్ తో పూరి తీసిన "బుజ్జిగాడు, ఏక్ నిరంజన్", రవితేజతో తెరకెక్కించిన 'నేనింతే', గోపీచంద్ తో రూపొందించిన 'గోలీమార్', రానాతో తీసిన 'నేను నా రాక్షసి' - ఏవీ మునుపటిలా అలరించలేకపోయాయి. హిందీలో అమితాబ్ బచ్చన్ తో పూరి జగన్నాథ్ రూపొందించిన 'బుడ్డా ... హోగా తేరా బాప్' మంచి విజయం సాధించింది. మహేశ్ తో పూరి రెండో సినిమా 'బిజినెస్ మేన్' వసూళ్ళ వర్షం కురిపించింది. కానీ, 'పోకిరి'లా మ్యాజిక్ చేయలేకపోయింది. తన తొలి హీరో పవన్ కళ్యాణ్ పూరి తీసిన రెండో సినిమా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' ఏ మాత్రం ఆకట్టుకోలేకపోవడం ఫ్యాన్స్ కు నిరాశ కలిగించింది. అల్లు అర్జున్ తో పూరి రెండో సినిమా 'ఇద్దరమ్మాయిలతో' కూడా వసూళ్ళతో సాగింది. ఆ పై వచ్చిన పూరి జగన్నాథ్ మూవీస్ ఏవీ మునుపటిలా మురిపించలేక పోయాయి. మధ్యలో జూనియర్ యన్టీఆర్ తో తీసిన 'టెంపర్' మాస్ ను ఆకట్టుకుంది. టాప్ స్టార్ బాలకృష్ణతో పూరి తెరకెక్కించిన 'పైసా వసూల్' అంతగా అలరించలేదు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణను గాయకునిగా మలిచారు. బాలయ్య గానం చేసిన "మామా... ఏక్ పెగ్ లా..." సాంగ్ మాత్రం భలేగా చిందులేయించింది. 2019లో రామ్ తో పూరి రూపొందించిన 'ఇస్మార్ట్ శంకర్' (Ismart Shankar) ఘనవిజయం సాధించింది. మళ్ళీ పూరి సక్సెస్ ట్రాక్ ఎక్కారని ఫ్యాన్స్ ఆశించారు. అయితే ఆ పై వచ్చిన "లైగర్, డబుల్ ఇస్మార్ట్" ఏ మాత్రం మురిపించలేకపోయాయి.

ఇప్పటి దాకా తన చిత్రాల ద్వారా పలువురు నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పించిన పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరిని తన సినిమాల్లో బాలనటునిగా నటింప చేశారు. తరువాత 'ఆంధ్రాపోరి' అనే సినిమాతో ఆకాశ్ హీరోగా పరిచయమయ్యాడు. అంతగా అలరించలేకపోయిందా చిత్రం. పూరి దర్శకత్వంలోనే ఆకాశ్ 'మెహబూబా'లో హీరోగా నటించాడు. అదీ అంతంత మాత్రంగానే ఆడింది. ఏది ఏమైనా ఒకప్పుడు తనదైన బాణీ పలికిస్తూ సాగిన పూరి జగన్నాథ్ ఈ పాతికేళ్ళ కెరీర్ లో పలు విజయాలు, అలాగే పరాజయాలూ చవిచూశారు. రాబోయే రోజుల్లో పూరి జగన్నాథ్ మునుపటి మ్యాజిక్ చూపిస్తారేమో చూద్దాం.

also Read: NTR: ఆడవేషంలో పెద్దాయన....

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 21 , 2025 | 09:30 AM