Arrest: పోసాని వికెట్ అవుట్... నెక్ట్స్ ఎవరు...
ABN , Publish Date - Feb 27 , 2025 | 12:22 PM
కూటమి నేతలపై ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో అవాకులు చెవాకులు పేలిన పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో ఇప్పుడు తదుపరి ఎవరి వంతు? అనే చర్చ ఫిల్మ్ నగర్ వర్గాలలో జరుగుతోంది.
ఉరుములు, మెరుపులు లేకుండా పిడుగు పడినట్టు... ప్రముఖ నటుడు, దర్శకుడు, ఎపి ఎఫ్.డి.సి. మాజీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ (Posani Krishna Murali) ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు బుధవారం రాత్రి సైలెంట్ గా ఇంటి నుండి పికప్ చేసుకుని వెళ్ళిపోయారు. అరెస్ట్ నోటీసును తీసుకోవడానికి ఆయన, ఆయన భార్య నిరాకరించడంతో కేసు వివరాలను విపులంగా చెప్పి, పోసాని కృష్ణమురళీని కారెక్కించారు. గత ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలోనూ పోసాని టీడీపీ (TDP), జనసేన (Janasena) నేతలపై చేసిన వ్యాఖ్యలకు చాలామంది బాధపడ్డారు. ఆ యా పార్టీల నాయకులు, కార్యకర్తలే కాకుండా... సాధారణ ప్రజానీకం కూడా మరీ ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయడానికి పోసానికి మనసెలా ఒప్పింది అని ఆశ్చర్యపోయారు. అయితే... ఎన్నికల తర్వాత ఓడలు బళ్ళు... బళ్ళు ఓడలు అయిన చందాన కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది. అప్పటి నుండి... ఇలా రాజకీయ నేతలపై అవాకులు, చెవాకులు పేలిన వారికి గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం మొదలైంది.
కూటమి ప్రభుత్వం తమ ప్రత్యర్థుల పట్ల ఎంత మెతకవైఖరి అవలంభించినా... కొందరికి కంటి మీద కునుకు పట్టలేదు. ముఖ్యంగా సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ లబ్దిపొందిన వారికి తత్త్వం బోధపడింది. ఆ విషయంలో ముందు మేల్కొన్న మనిషి అలీ (Ali)! ఆయన ఇక మీదట తాను రాజకీయాల జోలికు వెళ్ళనని, సినిమా నటనకే పరిమితం అవుతానని, గతంలో చేసిన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవద్దంటూ సంధి ప్రేలాపనలు చేశారు. అలానే కొన్ని కేసులతో ఉక్కిరి బిక్కిరి అయిన రామ్ గోపాల్ వర్మ (Ramgopal Varma)... మెట్టు దిగనంటూనే... తానూ ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఎవరినీ, ఏ పార్టీని విమర్శించబోనని స్పష్టంగా చెప్పేశారు. నిజానికి పోసాని కృష్ణమురళీ సైతం అలాంటి మాటలే కొంతకాలం క్రితం చెప్పారు. దాంతో తనపై కేసులు ఉన్నా... పోలీసులు, ప్రభుత్వంలోని పెద్దలు తనను పట్టించుకోకపోవచ్చుననే ధీమాతో ఉన్నారు. కానీ బుధవారం పోలీసులు ఆయన ఇంటి తలుపు తట్టేసరికీ ఉలిక్కి పడ్డారు. ఆ ఉలికిపాటు కేవలం పోసాని ది మాత్రమే కాదు... గతంలో ప్రతిపక్షనేతలపై దారుణమైన విమర్శలు చేసి, ఇప్పుడు బరి నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన వారిది కూడా! మరి పోసాని తరహాలోనే ప్రభుత్వం ఇతరుల మీద కూడా దృష్టి పెడితే... రేపు పోలీసులు సినిమా రంగంలోని ఎవరి ఇంటి తలుపు ముందు తడతారో అనే చర్చ సినిమా రంగంలో రంజుగా సాగుతోంది. హూ ఈజ్ ది నెక్ట్స్... లెట్స్ వెయిట్ అండ్ సీ.
Also Read: Drugs: మొన్న కె.పి. చౌదరి, నేడు కేదార్... టాలీవుడ్ ఉక్కిరి బిక్కిరి!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి