Pooja Hegde: నోరు జారిన పూజ.. ఫ్యాన్స్ ఫైర్
ABN , Publish Date - Feb 05 , 2025 | 07:45 AM
ఒకవైపు తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కొందరు తారలకు ఇంకా అవగాహన ఏర్పడకపోవడం గమనార్హం. పూజా హెగ్డే.. పేరుకి ముంబై అమ్మాయి అయినా తెలుగు ఇండస్ట్రీ బ్రేక్ ఇచ్చింది. కానీ.. ఆమె మాత్రం అవగాహన రాహిత్యంతో..
బాలీవుడ్ తారలు సౌత్ సినిమా గురించి మాట్లాడుతూ.. తెలుగు సినిమాని విస్మరించిన తీరు ఎన్నో సార్లు చూశాం. సౌత్ అంటే మద్రాస్, సాంబార్ ఇడ్లీ అనే భావన బాలీవుడ్ లో పాతుకుపోయింది. ఒకవైపు తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కొందరు తారలకు ఇంకా అవగాహన ఏర్పడకపోవడం గమనార్హం. ఇది ఇలా ఉంటే తెలుగు సినీ పరిశ్రమ ద్వారా కెరీర్ లో బ్రేక్ సాధించి టాప్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డే కూడా ఇలాంటి పొరపాటే చేయడం ఫ్యాన్స్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఇంతకు ఏం జరిగిందంటే..
పూజా హెగ్డే.. పేరుకి ముంబై అమ్మాయి అయినా తెలుగు ఇండస్ట్రీ బ్రేక్ ఇచ్చింది. దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో వంటి సినిమాలతో ఆమెకు మంచి పేరు లభించింది. ఆ తర్వాత తమిళంలోనూ టాప్ హీరోలతో నటించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే కెరీర్ లో అవకాశాలు తగ్గు ముఖం పడటంతో ఆమె బాలీవుడ్ బాటపట్టారు. తాజాగా షాహిద్ కపూర్ సరసన నటించిన 'దేవా' చిత్రం రిలీజ్ అయ్యింది. ఇదిలా ఉండగా ఆమె ఓ షోలో అవగాహనా రాహిత్యంతో మాట్లాడటం ఫ్యాన్స్ ని మండిపడేలా చేసింది.
ఆమె మాట్లాడుతూ.. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టైన ‘అల వైకుంఠపురములో’ సినిమాని తమిళ సినిమాగా అభివర్ణించింది. అల వైకుంఠపురములో, డీజే సినిమాలు రిజినలు సినిమాలు అయినా దేశం మొత్తం చూసింది ఎందుకంటే అందులో కంటెంట్ ఉంది కాబట్టి ఆమె చెప్పుకొచ్చింది. అంతా బాగానే ఉంది కానీ.. ‘అల వైకుంఠపురములో’ తమిళ సినిమా ఎలా అయ్యిందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
అలాగే ‘‘బాలీవుడ్ స్టార్ హీరోలైన సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించడాన్ని లక్‌గా భావిస్తున్నారా? ఆ చిత్రాలకు మీరు అర్హులు అని అనుకుంటున్నారా?’’ అని విలేకరి ప్రశ్నించగా. ‘‘నేను నటించిన ప్రతి చిత్రానికి నేను అర్హురాలినే. తమ చిత్రాల్లోకి నన్ను ఎంపిక చేసుకోవడంపై దర్శక నిర్మాతలకు కొన్ని కారణాలుంటాయి. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దానికి అనుగుణంగా సన్నద్థమై పూర్తి స్థాయిలో ఆ క్యారెక్టర్‌కు న్యాయం చేయాలి. అలా చేస్తే అదృష్టం వరించినట్లే అనుకుంటాను. నా జీవితంలో అదే జరిగింది.. జరుగుతుంది. ఒకవేళ మీరు అదృష్టం వల్లే నాకు ఈ అవకాశాలు వచ్చాయనుకుంటే.. నేను ఏ మాత్రం బాధపడను. అలాగే అనుకోండి’’ అని ఆగ్రహంగా మాట్లాడారు.
‘‘మీరు సినిమాలు ఎలా ఎంచుకుంటారు? స్టార్ హీరోల చిత్రాలైతేనే చేస్తారా?’’ అని విలేకరి ప్రశ్నించగా స్టార్ హీరోల గురించి వరుస ప్రశ్నలు వేయడంపై పూజాహెగ్డే ఆగ్రహానికి గురయ్యారు. ‘‘అసలు మీ సమస్య ఏంటి?’’ అని ప్రశ్నించారు. వాతావరణం కాస్త హీటెక్కుతోందని భావించిన షాహిద్ కపూర్ వెంటనే సరదాగా మాట్లాడారు. ‘‘నువ్వు యాక్ట్ చేసిన స్టార్ హీరోలంటే అతడికి ఇష్టం అనుకుంటా. అతడు కూడా ఆ హీరోల పక్కన యాక్ట్ చేయాలనుకుంటున్నారు. అందుకే నీ నుంచి సలహాలు తీసుకుంటున్నట్లు ఉన్నారు’’ అని జోకులు వేశారు.