Pooja Hegde: మీరు ఏదైనా అనుకోండి.. నాకు అనవసరం..

ABN , Publish Date - Feb 02 , 2025 | 02:04 PM

‘దేవా’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పూజాహెగ్డే, నటుడు షాహిద్‌ కపూర్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అగ్ర హీరోల చిత్రాల్లో నటించడంపై పూజా హెగ్డేను ప్రశ్నించగా ఆమె ఆగ్రహానికి గురయ్యారు.


వరుసగా అగ్ర హీరోలకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవ్వడంతో హీరోయిన్‌ పూజాహెగ్డే (Pooja Hegde) అసహనానికి గురైంది. తాజాగా ఆమె కథానాయికగా నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘దేవా’ (Deva). ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పూజాహెగ్డే, నటుడు షాహిద్‌ కపూర్‌ (Shahid Kapoor) ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అగ్ర హీరోల చిత్రాల్లో నటించడంపై పూజా హెగ్డేను ప్రశ్నించగా ఆమె ఆగ్రహానికి గురయ్యారు.


pooja.jpg

‘‘బాలీవుడ్‌ స్టార్‌ హీరోలైన సల్మాన్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, షాహిద్‌ కపూర్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాల్లో నటించడాన్ని లక్‌గా భావిస్తున్నారా? ఆ చిత్రాలకు మీరు అర్హులు అని అనుకుంటున్నారా?’’ అని విలేకరి ప్రశ్నించాడు. ‘‘నేను నటించిన ప్రతి చిత్రానికి నేను అర్హురాలినే. తమ చిత్రాల్లోకి నన్ను ఎంపిక చేసుకోవడంపై దర్శక నిర్మాతలకు కొన్ని కారణాలుంటాయి. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దానికి అనుగుణంగా సన్నద్థమై పూర్తి స్థాయిలో ఆ క్యారెక్టర్‌కు న్యాయం చేయాలి. అలా చేస్తే అదృష్టం వరించినట్లే అనుకుంటాను. నా జీవితంలో అదే జరిగింది.. జరుగుతుంది. ఒకవేళ మీరు అదృష్టం వల్లే నాకు ఈ అవకాశాలు వచ్చాయనుకుంటే.. నేను ఏ మాత్రం బాధపడను. అలాగే అనుకోండి’’ అని ఆగ్రహంగా మాట్లాడారు.  (Pooja Hegde Fire on Journalist)


‘‘మీరు సినిమాలు ఎలా ఎంచుకుంటారు? స్టార్  హీరోల చిత్రాలైతేనే చేస్తారా?’’ అని విలేకరి ప్రశ్నించగా స్టార్‌ హీరోల గురించి వరుస ప్రశ్నలు వేయడంపై పూజాహెగ్డే ఆగ్రహానికి గురయ్యారు. ‘‘అసలు మీ సమస్య ఏంటి?’’ అని ప్రశ్నించారు. వాతావరణం కాస్త హీటెక్కుతోందని భావించిన షాహిద్‌ కపూర్‌ వెంటనే సరదాగా మాట్లాడారు. ‘‘నువ్వు యాక్ట్‌ చేసిన స్టార్‌ హీరోలంటే అతడికి ఇష్టం అనుకుంటా. అతడు కూడా ఆ హీరోల పక్కన యాక్ట్‌ చేయాలనుకుంటున్నారు. అందుకే నీ నుంచి సలహాలు తీసుకుంటున్నట్లు ఉన్నారు’’ అని జోకులు వేశారు. 

Updated Date - Feb 02 , 2025 | 02:07 PM