Game Changer: పైరసీ మాఫియా దూకుడు.. పని చేయని యాంటీ పైరసీ సెల్
ABN , Publish Date - Jan 11 , 2025 | 11:13 AM
Game Changer: సంక్రాంతి సినిమాలకు పైరసీ మాఫియా చుక్కలు చూపిస్తోంది. ప్రత్యేకంగా యాంటీ పైరసీ సెల్స్ ఏర్పాటు చేసుకున్న ఉపయోగం లేకుండా పోతుంది. దీంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు.
సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలకు పైరసీ మాఫియా పెద్ద తలనొప్పిగా మారింది. శుక్రవారం రిలీజైన 'గేమ్ ఛేంజర్' సినిమా HD ప్రింట్లు కొన్ని గంటల్లోనే చాలా వెబ్ సైట్స్ లో కనిపించాయి. 12, 14వ తేదీల్లో రిలీజ్ కానున్న 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాల మేకర్స్ కి కూడా ఇప్పుడు పైరసీ భయం పట్టుకుంది. కొన్ని రోజుల క్రితం సినిమాలు ఓటీటీలోకి వచ్చాకే HD ప్రింట్లు వెబ్ సైట్స్ లో కనిపించేవి. సినిమా థియేటర్ లో ఉన్నపుడు క్లారిటీ లేని థియేటర్ ప్రింట్స్ మాత్రమే ఆన్లైన్ లో కనిపించేవి. కానీ.. ఇప్పుడు పైరసీ మాఫియా చాలా అడ్వాన్స్ అయ్యింది.
మరోవైపు సినిమా టికెట్ల ధరలు వీపరీతంగా పెంచడంతో.. వీక్షకులు కూడా పైరసీ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో సినీ మేకర్స్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిలిం ఛాంబర్ యాంటీ పైరసీ సెల్ ఏర్పాటు చేసింది. ఒక్కో సినిమాకు రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు యాంటీ పైరసీ సెల్ ఛార్జ్ చేస్తుంది. కొన్ని నిర్మాణ సంస్థలు ప్రత్యేకంగా యాంటీ పైరసీ సెల్స్ ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆయినా ఉపయోగం లేకుండా పోతుంది. దీంతో అంతిమంగా నిర్మాతలు బలైపోతున్నారు