Pawan Kalyan: విజువల్ ఫీస్ట్ గా 'హరిహరవీరమల్లు' సాంగ్ ప్రోమో

ABN , Publish Date - Feb 21 , 2025 | 02:03 PM

పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ కు మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సెంకడ్ సింగిల్ ను 24న విడుదల చేయబోతున్నారు. దాని ప్రోమో శుక్రవారం రిలీజ్ అయ్యింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu) నుండి సెకండ్ సింగిల్ 'కొల్లగొట్టినాదిరో' ఫిబ్రవరి 24న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా శుక్రవారం సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. కథానాయకుడు పవన్ కళ్యాణ్ తో పాటు కథానాయిక నిధి అగర్వాల్ (Nidhi Agarwal) పై ఈ పాటను నైట్ ఎఫెక్ట్స్ లో చిత్రీకరించారు. విశేషం ఏమంటే... ఇందులో అనసూయ భరద్వాజ్ (Anasuya) తో పాటు పూజిత పొన్నాడ (Poojitha Ponnada) కూడా స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది. 'కోర కోర మీసాలతో, కొదమ కొదమ అడుగులతో... కొంటెకొంటె చణుకులతో, కొలిమి లాంటి మగటిమితో... సరసర వచ్చినాడు చిచ్చర పిడుగంటి వాడు' అంటూ సాగే ఈ పాటను చంద్రబోస్ (Chandrabose) రాశారు. దీనిని ఎం.ఎం. కీరవాణి (Keeravaani) స్వరపర్చగా, దీనిని మంగ్లీ (Mangli), రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj ), రమ్య బెహరా, యామిని ఘంటసాల గానం చేశారు.


hv f.jpg

ఎ.ఎం. రత్నం సమర్పణలో ఆయన సోదరుడు దయాకరరావు 'హరిహర వీరమల్లు' సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఇది విడుదల కాబోతోంది. తొలి భాగాన్ని మార్చి 28న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. అయితే బాలెన్స్ ఉన్న చిత్రీకరణ ను పూర్తి చేసే బాధ్యతను ఎ.ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ భుజానికి కెత్తుకున్నాడు. పవన్ కళ్యాణ్‌ పాల్గొనగా నాలుగు రోజుల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒక్కటి ఇంకా చిత్రీకరించాల్సి ఉందని, అది మినహా మిగిలిన భాగానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను బాబీ డియోల్, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు పోషించారు.

Updated Date - Feb 21 , 2025 | 02:06 PM