Pawan Kalyan: తలసేమియా బాధితుల చికిత్సకు పవన్ విరాళం ఎంతో తెలుసా
ABN , Publish Date - Feb 15 , 2025 | 11:07 PM
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘యూఫోరియా మ్యూజికల్ నైట్’ (Euphoria Musical Night) ఈవెంట్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
"ఈ ఈవెంట్‌కు టికెట్ కొనమని మా వాళ్లకు చెబితే, విషయం తెలిసి, భువనేశ్వరిగారు (Nara Bhuvaneswari) ‘మీరు టికెట్ కొనక్కర్లేదు. కార్యక్రమానికి రండి’ అన్నారు. మీరంతా రూ. 1500 పెట్టి టికెట్ కొని నేను ఫ్రీ గా రావడం తప్పుగా అనిపించింది. అందుకుని, నా వంతుగా తలసేమియా బాధితుల చికిత్స కోసం త్వరలోనే ఎన్టీఆర్ ట్రస్ట్‌కు (Ntr trust) రూ.50 లక్షలు విరాళం ఇస్తా" అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP DCM Pawan Kalyan)అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘యూఫోరియా మ్యూజికల్ నైట్’ (Euphoria Musical Night) ఈవెంట్‌లో పాల్గొన్న అయన మాట్లాడుతూ
‘‘నారా భువనేశ్వరిగారంటే నాకు ఎంతో గౌరవం. కష్టాలు, ఒడుదొడుకుల్లో చెక్కు చెదరకుండా బలమైన సంకల్పంతో ఉన్న ఆమెను దగ్గరి నుంచి చూశా. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో తలసేమియా బాధితుల కోసం కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. బాలకృష్ణగారిని ఎప్పుడు కలిసినా ‘బాలయ్య అని పిలువు’ అంటారు కానీ, నాకు ‘సర్’ అనే పిలవాలనిపిస్తుంది. ఎవరినీ లెక్క చేయని వ్యక్తిత్వం ఆయనది. తాను అనుకున్నది బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. ఎన్ని తరాలు వచ్చినా ప్రేక్షకులు ఆకర్షించే నటన ఆయన సొంతం. సినిమాల్లోనే కాదు, సేవాల్లోనూ ముందుంటారు. ఇవన్నీ గుర్తించే ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్‌తో గుర్తించింది. ప్రచార హంగామా లేకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవ చేసుకుంటూ వెళ్తుంది. ఎన్టీఆర్ మన మధ్య లేకపోయినా ట్రస్ట్ ద్వారా మన గుండెల్లో ఉన్నారు. ఆయన అమరజీవి. ఒక మంచి పని ప్రారంభించడం, దానిని కొనసాగించడం చాలా కష్టం. అలాంటిది 28 ఏళ్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్ కొనసాగించడం.. ఇప్పుడు తలసేమియా బాధితుల కోసం ఈవెంట్‌ను ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయం’’ అన్నారు.
అయన స్పందించే తీరు అద్భుతం
‘‘నా దగ్గరకు వచ్చే బాధితులకు సాయం చేయమని కోరుతూ సీఎం చంద్రబాబుగారి ఆఫీస్‌కు లేఖరాస్తే, వారు స్పందించే తీరు అద్భుతంగా ఉంటుంది. ట్రస్ట్‌ను ఎప్పుడూ నిర్వీర్యం చేయాలి.. హైజాగ్ చేయాలనుకునేవాళ్లు ఉంటారు. దాన్ని కాపాడుకుంటూ చంద్రబాబు వచ్చారు. సహాయ కార్యక్రమంలో వినోదం చూడొచ్చని ఈ మ్యూజికల్ నైట్ ద్వారా నిరూపించారు. ఈ కార్యక్రమానికి సంగీతం అందిస్తున్న తమన్ గారికి ప్రత్యేక అభినందనలు" అన్నారు