Game changer tragedy: మృతులకు పవన్ ఆర్థిక సాయం.
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:31 PM
‘గేమ్ ఛేంజర్’ (game Changer) ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి వస్తోన్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు.
రామ్‌చరణ్ (Ram CHaran) హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ (game Changer) ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి వస్తోన్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. జనసేన పార్టీ (Janasena) తరఫున బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. ‘‘కాకినాడ - రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమై పోయింది. గత ఐదేళ్లలో ఈ రోడ్డు గురించి ఎవరూ పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును కొంతకాలంగా బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యా. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇళ్లకు వెళ్తున్న సమయంలో వేగంగా వస్తోన్న మరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఇద్దరు మృతి చెందారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం ఈ రోడ్డు విస్తరణ, పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదు. కనీస నిర్వహణ పనులు కూడా చేయలేదు. సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు. ఫలితంగా ప్రమాదాలు పెరిగాయి. ఐదు నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడే రోడ్డు ఇది. రెండు నగరాల మధ్య ప్రయాణాల కోసం ప్రజలు ప్రత్యామ్నాయ రోడ్డు మీద వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టింది. ఈ దశలో ప్రమాదం చోటుచేసుకోవడం బాధకరం. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక నుంచి ఇళ్లకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది(Game changer Event tragedy. ఇళ్లకు సురక్షితంగా వెళ్లండి అని ఆరోజు వేడుకలో ఒకటికి, రెండు సార్లు చెప్పాను. ఈ ప్రమాదం నన్నెంతో బాధించింది. జనసేన తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం.. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని నా కార్యాలయ అధికారులకు స్పష్టం చేశారు. ఇకనుంచి పిఠాపురం నియోజకవర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలనే నిర్ణయించుకున్నాను’’ అని పవన్ తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు.