NTR First Remuneration: ఎన్టీఆర్ కు కృష్ణవేణి ఇచ్చిన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా

ABN , Publish Date - Feb 16 , 2025 | 02:07 PM

అప్పుడే యన్టీఆర్ లో ఓ గొప్ప నటుడున్నాడని ప్రసాద్ గ్రహించారు. అందువల్ల ప్రోత్సహించారు. చిత్రసీమకు రమ్మని ఆహ్వానించారు. కానీ, రామారావు చదువు కాగానే కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగం చేయడం, ఆ తరువాత అక్కడి వాతావరణం నచ్చక రాజీనామా చేయడం జరిగాయి. అప్పుడు మద్రాసు వెళ్ళాలని నిర్ణయించారు.

నటరత్న తొలి చిత్రంగా నిలచిన 'మనదేశం' నిర్మించిన నటి కృష్ణవేణి (Krishnaveni) ఫిబ్రవరి 16 తెల్లవారుఝామున కన్నుమూశారు. 'మన దేశం'లో (Manadesam) యన్టీఆర్ కు (NTR)అవకాశం లభించడం.. ఆయన అభినయానికి అందుకున్న పారితోషికం... విడుదలయ్యాక సినిమా సాగిన వైనం అన్నీ ఆసక్తి కలిగిస్తాయి.'మనదేశం' చిత్రాన్ని తెరకెక్కించక మునుపే దర్శకుడు యల్వీ ప్రసాద్ తగిన నటీనటుల అన్వేషణ కోసం నాటకాలు చూస్తూ సాగారు. ఆ సమయంలోనే విజయవాడలో యన్టీఆర్ వేసిన నాటకం చూశారు. అప్పుడే యన్టీఆర్ లో ఓ గొప్ప నటుడున్నాడని ప్రసాద్ గ్రహించారు. అందువల్ల ప్రోత్సహించారు. చిత్రసీమకు రమ్మని ఆహ్వానించారు. కానీ, రామారావు చదువు కాగానే కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగం చేయడం, ఆ తరువాత అక్కడి వాతావరణం నచ్చక రాజీనామా చేయడం జరిగాయి. అప్పుడు మద్రాసు వెళ్ళాలని నిర్ణయించారు. అప్పటికే 'మనదేశం' షూటింగ్ మొదలయింది. ఈ చిత్రాన్ని మీర్జాపురం రాజా వారి సతీమణి నటి కృష్ణవేణి నిర్మించి, నాయికగా నటించారు. 'మనదేశం' లో యన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ అధికారి పాత్రలో నటించి మెప్పించారు. అందుకు గానూ ఆయనకు రెండు వందల యాభై రూపాయలు పారితోషికం అందించారు కృష్ణవేణి. ఏ ముహూర్తాన కృష్ణవేణి రామారావుకు ఆ మొత్తం అందించారో కానీ తరువాతి రోజుల్లో సూపర్ స్టార్ గా సౌత్ లోనే అత్యధిక పారితోషికం (NTR First Remuneration) పుచ్చుకొనే స్థాయికి చేరారు ఎన్టీఆర్! అందుకే కృష్ణవేణిది లక్కీ హ్యాండ్ అని అప్పటి సినీ జనం అంటూ ఉండేవారు. చిత్తూరు నాగయ్య, సిహెచ్.నారాయణరావు అప్పటికే పేరున్న నటులు.. వారితో కలసి రామారావు వంటి కొత్త నటుడు ఎలా నటిస్తారో అనుకున్నారు... కానీ, అదరక బెదరక తన పాత్రను తాను ప్రతిభావంతంగా పోషించారు రామారావు... ఆయన ప్రతిభతోనే అగ్ర పథానికి చేరుకున్నారని కృష్ణవేణి చెబుతుండేవారు.


'మనదేశం' చిత్రానికి ఘంటసాల సంగీతం సమకూర్చారు. రేలంగి ఇందులో పోలీస్ వెంకటస్వామి పాత్రలో కనిపించారు. ఇందులోని పాటలు అప్పట్లో జనం నోళ్ళలో విశేషంగా చిందులు వేశాయి. తరువాతి రోజుల్లో దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన తాతినేని ప్రకాశరావు ఈ సినిమాలో బిట్ రోల్ లో కనిపించారు. ఇలా పలు విశేషాలతో రూపొందిన 'మనదేశం' చిత్రం 1949 నవంబర్ 24న విడుదలయింది. ఈ చిత్రానికి ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయ్ రాసిన 'విప్రదాస్' ఆధారం. ఆ కథకు ఎల్వీ ప్రసాద్ స్క్రీన్ ప్లే రాయగా, సముద్రాల సీనియర్ మాటలు, పాటలు పలికించి ఆకట్టుకున్నారు. నటుడిగా, రాజకీయ నేతగా ఎన్టీ ఆర్ అందుకోని ఎత్తులు లేవు. అంత గొప్ప వ్యక్తిని తెలుగు తెరకు పరిచయం చేసిన నిర్మాతగా కృష్ణవేణి పేరు తెలుగు సినిమా రంగంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

Updated Date - Feb 16 , 2025 | 02:07 PM