Nithiin: ఆలస్యం చేస్తున్న మైత్రీ.. అడ్వాన్స్ అయిన దిల్ రాజు
ABN , Publish Date - Jan 02 , 2025 | 03:36 PM
Nithiin: హీరో నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమా రిలీజ్ పై ఉత్కంఠ వీడటం లేదు. రాబిన్ హుడ్ తర్వాత తెరకెక్కించిన సినిమానే ముందుగా రిలీజ్ కావడానికి సిద్ధం కానుండటం విశేషం. ఇంతకీ ‘రాబిన్ హుడ్’ పరిస్థితి ఏంటి? ముందే వస్తున్న సినిమా ఏంటంటే..
నితిన్ (Nithiin) హీరోగా వెంకీ కుడుముల (Venky kudumula) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాబిన్ హుడ్’ (Robinhood). మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఈ చిత్రాన్ని డిసెంబర్ 25, సంక్రాంతి, శివరాత్రి అంటూ వాయిదా వేసుకొచ్చారు. కాగా, సినిమాని ఏకంగా సమ్మర్ కి షిఫ్ట్ చేసినట్లు సమాచారం. నితిన్- వెంకీ కుడుముల కలయికలో రానున్న రెండో చిత్రమిది. శ్రీలీల కథానాయిక. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల చిత్రబృందం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లోనూ షూటింగ్ అప్‌డేట్ ను షేర్ చేస్తూ ఒక్క పాట మాత్రమే మిగిలి ఉందని చెప్పారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా సినిమా విడుదల ఆలస్యం కానున్నట్లు సమాచారం. నితిన్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి.
రాబిన్‌హుడ్ కన్నా ముందే తమ్ముడు
పవన్‌కల్యాణ్ హీరోగా గతంలో ‘తమ్ముడు’ పేరుతో ఓ సినిమా వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అదే టైటిల్‌తో మరో సినిమా వస్తోంది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ లో.. కాగడా చేత పట్టిన నితిన్, భుజాన ఓ పాపను ఎత్తుకుని పరిగెడుతూ రావడం, ఆయనతో పాటు ఊరి ప్రజలు కూడా కాగడాలతో అనుసరిస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న 56వ చిత్రమిది, ఇందులో నటి లయ కీలక పాత్రను పోషిస్తోందనీ నిర్మాతలు వెల్లడించారు. ‘వకీల్ సాబ్’ చిత్రం తర్వాత దర్శకుడు శ్రీరామ్ వేణు రూపొందిస్తున్న చిత్రం కావడంతో ‘తమ్ముడు’ మీద భారీ అంచనాలు ఉన్నాయి.