Nidhi Agerwal: నిధికి తప్పని నిరీక్షణ...

ABN , Publish Date - Mar 17 , 2025 | 10:27 AM

నిధి అగర్వాల్ తెలుగులో నటిస్తున్న రెండు పాన్ ఇండియా సినిమాలూ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఎట్టకేలకు 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ఖరారు కాగా 'ది రాజా సాబ్' విడుదల తేదీ ఇంకా డోలాయమానంగానే ఉంది.

అందాల భామ నిధి అగర్వాల్ (Nidhi Agerwal) నిరీక్షణకు ఇంకాస్తంత టైమ్ పట్టక తప్పడం లేదు. తెలుగులో చేస్తున్న రెండు పాన్ ఇండియా సినిమాలు వాయిదా మీద వాయిదా పడటంతో అమ్మడు కాస్తంత నిరాశకు లోనవుతున్నట్టు తెలుస్తోంది. ఆ మధ్య ఒకే రోజున రెండు పాన్ ఇండియా సినిమాల్లో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా మధ్య చక్కర్లు కొడుతున్నారంటూ నిధి సోషల్ మీడియా వేదికగా తన హర్షాన్ని వెలిబుచ్చింది. తెలుగులో చేస్తున్న ఈ రెండు కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ కావడంతో తప్పకుండా తనకు మరోసారి ఈ సినిమాలతో జాతీయ స్థాయిలో క్రేజ్ వస్తుందని నిధి భావించింది. ఇప్పటికే అనేక పర్యాయాలను వాయిదా పడిన పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu) మూవీని మే 9న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇక మరో పాన్ ఇండియా మూవీ 'ది రాజా సాబ్' (The Raja Saab) విడుదల ఎప్పుడనేది ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే నిజానికి ఆ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయాల్సి ఉంది. కానీ గ్రాఫిక్స్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవంతో దానిని జూన్ లేదా జులైకు వాయిదా వేస్తారని సమాచారం. కానీ అదీ ఖచ్చితంగా మేకర్స్ చెప్పడం లేదు. ఏప్రిల్ 10న 'రాజా సాబ్' రాదనే నమ్మకంతో సిద్ధు జొన్నలగడ్డ 'జాక్' (Jack) మూవీని, ప్రదీప్ మాదిరాజు 'అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి' సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక హిందీ అనువాద చిత్రం 'జాట్' (Jaat), తమిళ అనువాద చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) తెలుగులోనూ వస్తున్నాయి.


2022 జనవరి 15న వచ్చిన 'హీరో' (Hero) సినిమా తర్వాత ఇంతవరకూ నిధి అగర్వాల్ నటించిన మరే చిత్రమూ తెలుగులో విడుదల కాలేదు. దాంతో మూడేళ్ళుగా ఈ రెండు ప్రాజెక్ట్స్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. 'ది రాజా సాబ్'లో మరికొందరు కథానాయికలు ఉన్నా... 'హరిహర వీరమల్లు'లో మాత్రం నిధి అగర్వాల్ సోలో హీరోయిన్. పైగా తాజాగా విడుదలైన రిలీజ్ డేట్ పోస్టర్ లో గుర్రమెక్కి ఉన్న నిధి ఫోటోను చూస్తే... ఆమె ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలలోనూ నటించినట్టు అర్థమౌతోంది. మరి ఈ రెండు సినిమాలతో ఆమె ఆశించిన గుర్తింపు దక్కుతుందేమో చూద్దాం.

Also Read: UV Creations: సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ పూర్తి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 17 , 2025 | 10:27 AM