Nidhhi Agerwal: పవన్ కళ్యాణ్ దగ్గర చాలా నేర్చుకోవాలి
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:25 AM
పవన్ కల్యాణ్, ప్రభాస్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. పవన్ సెట్స్‌లో ఉన్నప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఉంటారు. యాక్షన్ చెప్పగానే పూర్తిగా పాత్రలోకి వెళ్లిపోతారు. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోరు.
నిధీ అగర్వాల్ (Nidhhi Agerwal) మంచి ఫామ్‌లో ఉన్నారు. సక్సెస్‌లు లేకపోయినా అవకాశాలు మాత్రం బాగానే వరిస్తున్నాయి. ఇప్పటికే ఆమె రెండు భారీ చిత్రాల్లో అగ్ర హీరోల సరసన నటిస్తోంది. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ (HariHara Veeranallu), ‘ది రాజాసాబ్’తో (The Rajasaab) ఈ ఏడాది ప్రేక్షకులకు వినోదాన్ని అందించనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన అప్‌కమింగ్ సినిమాల గురించి మాట్లాడారు. 2022లో గ్యాప్ తీసుకోవడానికి గల కారణాన్ని వివరించారు.
‘హరిహర వీరమల్లు' లో నా పాత్ర ఇప్పటివరకు నేను చేసిన వాటిల్లో అత్యుత్తమమైనది. ఆ పాత్ర కోసం గుర్రపు స్వారీ, క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. కథక్ నేర్చుకున్నాను. నా కల నిజమైంది. అదృష్టవంతురాలిని అని అనిపించింది. అలాగే హర్రర్ సినిమాలంటే గతంలో భయం ఉండేది. అందుకే ‘ది రాజా సాబ్’ చేయాలనుకున్నాను. సెట్‌లో స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు కూడా అందరం నవ్వుతూనే ఉన్నాం’’ అని (Nidhhi Agerwal) అన్నారు.
సెట్‌లో విషయానికొస్తే.. పవన్ కల్యాణ్, ప్రభాస్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. పవన్ సెట్స్‌లో ఉన్నప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఉంటారు. యాక్షన్ చెప్పగానే పూర్తిగా పాత్రలోకి వెళ్లిపోతారు. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోరు. ఆ సన్నివేశంపై మాత్రమే దృష్టిపెడతారు. ఈ లక్షణాన్ని నేను కూడా అలవాటు చేసుకోవాలి. ప్రభాస్ ఫన్నీ పర్సన్. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తాయా అని ఆతురతగా ఎదురుచూస్తున్నా’’ అని అన్నారు.
‘‘నేను స్టార్ కిడ్‌ని కాదు. సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చాను. నేను నటిగా మొదటి స్థానంలో ఉండడమే పెద్ద విషయం. సినిమాల్లో అవకాశాలు రావడమే నాకు విజయంతో సమానం. ఎక్కువ సినిమాలు చేయాలని అందరికీ ఉంటుంది. కానీ, నేను మాత్రం నమ్మకం ఉన్న కథలనే ఎంచుకుంటాను. అలాంటి వాటిపైనే దృష్టి పెడతాను. వరుసగా కమర్షియల్ సినిమాలు చేయడానికి నేనేమీ హీరోను కాదు. ఒకవేళ నేను వరుస సినిమాలు చేసినా నన్ను అలాంటి స్ర్కిప్ట్‌లు ఎంచుకున్నందుకు కామెంట్ చేస్తారు. అందుకే గొప్ప కథలను మాత్రమే ఎంచుకుంటున్నాను’’ అన్నారు.