Robinhood: హుక్ స్టెప్స్ పై విమర్శల వెల్లువ

ABN , Publish Date - Mar 12 , 2025 | 03:42 PM

బ్యాక్ టు బ్యాక్ వచ్చిన రెండు సినిమాల పాటలపై నెటిజన్స్ విమర్శల దాడి మొదలెట్టారు. 'రాబిన్ హుడ్'లోని ఐటమ్ సాంగ్, 'కన్నప్ప'లోని ప్రేమ గీతం హద్దులు మీరి ఉన్నాయని అంటున్నారు.

యంగ్ హీరోలు ఏం చేసినా... జనాలు పెద్దంత పట్టించుకోరు. కానీ సీనియర్ స్టార్స్... అందులోనూ ప్రజలలో మంచి గుడ్ విల్ ఉన్న వారు పాటలో వేసే స్టెప్స్ గురించిన విమర్శలు ఎక్కువ వస్తాయి. గతంలో చిరంజీవి రీ-ఎంట్రీ ఇస్తూ 'ఖైదీ నెంబర్ 150' (Khaidi No. 150) లో 'అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు' అనే పాటలో కాజల్ (Kajal) ఛాతీ మీద చిరంజీవి (Chiranjeevi) చేతితో గుద్దడాన్ని కొందరు తప్పుపట్టారు. ఆ పాటకు కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టరే... 'డాకు మహారాజ్' (Daaku Maharaj) లో ఊర్వశీ రౌతేలా సాంగ్ లో బాలకృష్ణ(Balakrishna) తో వేయించిన మూమెంట్స్ విమర్శకు గురయ్యాయి. శేఖర్ మాస్టర్ (Sekhar Master) కొరియోగ్రఫీ చేసిన లేటెస్ట్ సాంగ్ కూడా ఒకటి విపరీతంగా ట్రోలింగ్ కు గురయ్యింది. 'రాబిన్ హుడ్' మూవీలోని 'అది దా సర్ ప్రైజ్' అనే పాటలో కేతికా శర్మ (Ketika Sharma) స్కర్ట్ ను ముందుకు లాగుతూ వేసిన స్టెప్సు చూసి కుర్రకారు సైతం నోరు తెరిచారు. ఎంత ఐటమ్ సాంగ్ అయినా ఇలాంటి స్టెప్స్ ఎలా వేయిస్తారంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ పాటకు రాసిన సాహిత్యాన్ని కూడా తప్పు పట్టారు. ఇప్పటి వరకూ హీరోయిన్ గా నటించిన కేతికా శర్మ... మొదటి సారి ఐటమ్ సాంగ్ చేసింది. అయితే హీరోయిన్ గా నటించినా, ఐటమ్ గర్ల్ గా నటించిన అందాల విందుకు తాను సై అని మరోసారి కేతిక నిరూపించుకుంది.


మంచు విష్ణు (Manchu Vishnu) టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సినిమా 'కన్నప్ప' (Kannappa). దీనిని మోహన్ బాబు (Mohanbabu) ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక చిత్రం ఏప్రిల్ 25న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఇందులోని 'సగమై... చెరి సగమై' అనే ప్రేమ గీతాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో హీరోయిన్ ప్రీతి ముకుందన్ వేసుకున్న దుస్తులు; ఆమెకు, విష్ణుకు మధ్య ఉన్న లిప్ లాక్ సన్నివేశాలు చూసి జనాలు ఔరా అనుకున్నారు. వివిధ భాషల్లోని అగ్ర కథానాయకులు సైతం 'కన్నప్ప'లో కీలక పాత్రలు, అతిధి పాత్రలూ పోషించారు. ఈ సినిమా తనను నటుడిగా మరో మెట్టు పైకి తీసుకెళుతుందని విష్ణు చెబుతూ వచ్చారు. మంచు విష్ణు తీస్తున్న 'కన్నప్ప'ను తాము ఆధ్యాత్మిక చిత్రం అనుకున్నామని, కానీ ఆయన 'కామసూత్ర' తీశారనిపిస్తోందని కొందరు కామెంట్ చేశారు. ఈ పాటను సీనియర్ కొరియోగ్రఫర్ ప్రభుదేవా (Prabhu Deva) నృత్య రీతులు సమకూర్చారు. శ్రీమణి రాశారు. భక్తి భావనతో 'కన్నప్ప' థియేటర్లకు వచ్చే వారికి ఈ తరహా పాటలు చాలా ఇబ్బందికి గురిచేస్తాయని నెటిజన్స్ అంటున్నారు. చిత్రం ఏమంటే... నితిన్, శ్రీలీల జంటగా నటించిన 'రాబిన్ హుడ్'ని ఫ్యామిలీ ఆడియెన్స్ చూసే సినిమాగా మేకర్స్ చెబుతున్నారు. కానీ అందులో ఐటమ్ సాంగ్ చూసినప్పుడు ఇది ఫక్తు కమర్షియల్, ఎ గ్రేడ్ మూవీలా అనిపిస్తోందనే భావన వ్యక్తమౌతోంది. అలాగే డివోషనల్ మూవీ 'కన్నప్ప'లోని ప్రేమగీతం ఎరాటిక్ సాంగ్ ను తలపిస్తోందని అంటున్నారు. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ విడుదలైన 'రాబిన్ హుడ్', 'కన్నప్ప' సినిమా గీతాలపై జనాలు విరుచుకు పడుతున్నారు.

Also Read: Dia Mirza: ఖరీదైన దుస్తులు వేసుకున్నా.. తిన్నది మాత్రం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2025 | 03:42 PM