Balakrishna: బాలకృష్ణ మిస్సయిన మల్టీస్టారర్స్
ABN , Publish Date - Feb 17 , 2025 | 02:09 PM
తెలుగునాట అసలు సిసలు మల్టీస్టారర్స్ అంటే యన్టీఆర్ (NTR)-ఏయన్నార్ (ANR) కాంబినేషన్ లోనూ, తరువాత శోభన్ బాబు (Sobhan Babu) - కృష్ణ (Krishna) కలయికలోనూ రూపొందాయని చెప్పొచ్చు.
తెలుగునాట అసలు సిసలు మల్టీస్టారర్స్ అంటే యన్టీఆర్ (NTR)-ఏయన్నార్ (ANR) కాంబినేషన్ లోనూ, తరువాత శోభన్ బాబు (Sobhan Babu) - కృష్ణ (Krishna) కలయికలోనూ రూపొందాయని చెప్పొచ్చు. ఆ తరువాత సమాన స్థాయి కలిగిన స్టార్స్ ఎవ్వరూ తెలుగు చిత్రాల్లో కలసి నటించలేదు. దాదాపు 37 ఏళ్ళ తరువాత జూ.యన్టీఆర్ (Jr.NTR), రామ్ చరణ్ (Ram Charan) వంటి టాలీవుడ్ టాప్ స్టార్స్ కలసి నటించిన 'ట్రిపుల్ ఆర్' (RRR)తోనే అసలైన మల్టీస్టారర్ వెలుగు చూసింది. అయితే ఒకానొక దశలో సూపర్ స్టార్ గా సాగుతున్న బాలకృష్ణ(Balakrishna) తనకు అన్ని విధాలా నాగార్జున (Nagarjuna) పోటీదారుడు కావాలని కోరుకున్నారు. దాంతో కొందరు నిర్మాతలు బాలకృష్ణ- నాగార్జున కాంబోలో మల్టీస్టారర్ నిర్మించాలనీ ఆశించారు. ముఖ్యంగా 'గుండమ్మ కథ' (Gundamma Katha)ను రీమేక్ చేయాలని భావించారు. అయితే ఎందువల్లో అది కార్యరూపం దాల్చలేదు. కారణాలు ఏవైనా చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ (Venkatesh) తరంలో ఎవరూ మరొకరితో కలసి నటించలేదు. అంతే కాదు తమ తరువాతి తరం స్టార్స్ తోనూ చిరంజీవి, బాలకృష్ణ కలసి నటించక పోవడం గమనార్హం! వెంకటేశ్ మాత్రం మహేశ్ (Mahesh)తో కలసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో నటించారు.
అదలా ఉంచితే బాలకృష్ణతోనూ మహేశ్ బాబు నటించే ఓ సినిమాకు ప్రయత్నాలు సాగాయట! ఆ ట్రయల్స్ వేసింది మరెవరోకాదు మహేశ్ కు 'పోకిరి'తో ఇండస్ట్రీ హిట్ అందించిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). మహేశ్ తో 'బిజినెస్ మేన్' అనే మరో మాస్ మసాలా చిత్రాన్ని కూడా తెరకెక్కించారు పూరి. ఆ తరువాత బాలకృష్ణ హీరోగా 'పైసా వసూల్' అనే సినిమానూ రూపొందించారు జగన్నాథ్. ఈ నేపథ్యంలోనే బాలయ్య, మహేశ్ కాంబోలో ఓ కథను రూపొందించి తెరకెక్కించే ప్రయత్నం చేశారు పూరి. ఆయన దర్శకత్వంలో నటించడానికి బాలయ్య, మహేశ్ ఇద్దరూ ఓకే చెప్పినట్టు సమాచారం. కాకపోతే, ఇద్దరు స్టార్స్ కు తగ్గ సబ్జెక్ట్ ను తయారు చేయడంలో పూరి విఫలమయ్యారు. అలా బాలయ్య, మహేశ్ కాంబో వెలుగు చూడలేకపోయింది. గతంలోనూ బాలయ్య 'ఆదిత్య 369'లో తెనాలి రామకృష్ణ పాత్రకు కమల్ హాసన్ (Kamal Haasan) అయితే బాగుంటుందని మేకర్స్ భావించారట. అయితే అప్పట్లో అటు కమల్ హాసన్, ఇటు బాలయ్య తమ చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల డేట్స్ అడ్జెస్ట్ కాలేదు. ప్రస్తుతం రజనీకాంత్ (Rajnikanth) 'జైలర్-2'లో బాలకృష్ణ ఓ కీ రోల్ లో కనిపించనున్నారని వినిపిస్తోంది. అదే నిజమైతే బాలయ్య మొదటిసారి ఓ టాప్ స్టార్ తో కలసి నటించిన మల్టీస్టారర్ ను చూడవచ్చు.