Padma Bhushan Balakrishna: అప్పుడు.. ఇప్పుడు.. ఎల్లప్పుడూ... పద్మభూషణ్ పురస్కారంపై బాలయ్య ఎమోషన్!
ABN , Publish Date - Jan 26 , 2025 | 12:12 PM
తనని పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి నందమూరి నటసింహం బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. అందులో..
76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2025) ప్రకటించిన విషయం తెలిసిందే. అనేక రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేశారు. ఈ పద్మ అవార్డులలో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మ శ్రీ పురస్కారాలు వరించాయి. ఏపీ నుంచి కళల విభాగంలో నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ పురస్కారం వరించగా.. ఈ పురస్కారంపై బాలయ్య ఎమోషనల్ అయ్యారు.
Also Read- Padma Bhushan Puraskar 2025: బాలయ్యతో పాటుగా పద్మ భూషణ్ పొందిన నటులెవరంటే..
ఈ పురస్కారానికి తను ఎంపిక కావడంపై బాలయ్య స్పందిస్తూ అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. ఈ సందర్భంగా బాలయ్య స్పందిస్తూ.. ‘‘నాకు పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించిన సందర్భంగా, ఈ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. నా ఈ సుధీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు మరియు యావత్ చలనచిత్ర రంగానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
Also Read- Mass Jathara Teaser: జాతర కాదు.. ర్యాంపేజ్.. ‘మనదే ఇదంతా’!
నా తండ్రిగారైన స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుండి ఆయన వారసుడిగా నేటి వరకు నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న నా అభిమానులకు, నాపై తమ విశేష ఆధారాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉండగలనని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నాతోటి పద్మ అవార్డు గ్రహీతలందరికీ కూడా నా అభినందనలు అందిస్తున్నాను. అప్పుడు... ఇప్పుడు... ఎల్లప్పుడూ... సదా మీ నందమూరి బాలకృష్ణ’’ అని బాలయ్య ఎమోషనల్ అవుతూ ఓ లేఖను విడుదల చేశారు. కాగా, బాలయ్యకు పద్మ భూషణ్ పురస్కారం అనౌన్స్ అయినప్పటి నుండి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.