Naga Vamsi: తప్పుగా మాట్లాడలేదు.. వివాదంపై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:46 AM
Naga Vamsi: నేను నిర్మాత కావడానికి పెద్ద ఇన్‌స్పిరేషనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. దర్శకుడిగా కరణ్ తొలి చిత్రం ‘కుచ్ కుచ్ హోతా’ చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యాను.. ఎప్పటికైనా ఇంత రిచ్‌గా, ఆకర్షణీయంగా సినిమా తీయాలి అనే ఫాంటసీ నాలో ఏర్పడింది.
ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ నిర్వహించిన 2024 మెగా పాన్ ఇండియన్ ప్రొడ్యూసర్స్ రౌండప్‌లో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌లలో ఒకరైన నాగ వంశీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ వేదికపై ఆయన బాలీవుడ్ పై చేసిన కామెంట్స్, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో వ్యవహరించిన తీరు తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ దర్శకులు హన్సల్ మెహతా, సంజిత్ గుప్తాలు నాగ వంశీపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే నాగ వంశీ మరోసారి క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగ వంశీ మాట్లాడుతూ.. "నాకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదు. నేను గత కొన్నేళ్లుగా ఏం జరుగుతోందన్నది మాత్రమే వివరించా. అంతకుమించి ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అని నేను మాట్లాడలేదు. నేను షారుఖ్ ఖాన్‌కు డైహార్డ్ ఫ్యాన్.. అలాగే రణబీర్ కపూర్, దీపికా పదుకొనేలను కూడా అమితంగా అభిమానిస్తా. నేను నిర్మాత కావడానికి పెద్ద ఇన్‌స్పిరేషనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. దర్శకుడిగా కరణ్ తొలి చిత్రం ‘కుచ్ కుచ్ హోతా’ చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యాను.. ఎప్పటికైనా ఇంత రిచ్‌గా, ఆకర్షణీయంగా సినిమా తీయాలి అనే ఫాంటసీ నాలో ఏర్పడింది. అలాంటిది నేను బాలీవుడ్‌ను కావాలని కించపరచడం లాంటిది ఏమీ లేదని" నాగవంశీ స్పష్టం చేశాడు.
అసలు ఏం జరిగిందంటే..
2024 వీడ్కోలు చెబుతూ ఓ వెబ్‌సైట్ దక్షిణాదితోపాటు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శక నిర్మాతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఇందులో నాగవంశీ, బోనీకపూర్ పాల్గొన్నారు. బోనీకపూర్ మాట్లాడుతూ.. ‘‘దక్షిణాది సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ ఉంది. తెలుగు చిత్రాలకు యూఎస్, తమిళ మూవీలకు సింగపూర్, మలేషియా, గల్ఫ్‌లో మార్కెట్ బాగుంటుంది’’ అని పేర్కొన్నారు. గల్ఫ్‌లో మలయాళం సినిమాలకే బిగ్గెస్ట్ మార్కెట్ ఉంటుందని నాగవంశీ అన్నారు. ‘‘సౌతిండియా ఫిల్మ్‌మేకర్స్, యాక్టర్స్ బాలీవుడ్‌పై ప్రభావం చూపారు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘పుష్ప 2’ లాంటి చిత్రాలతో మార్పు చూసి ఉంటారు. ‘యానిమల్’, ‘జవాన్’ సినిమాలు దక్షిణాది దర్శకులు తెరకెక్కించినవే. హిందీ చిత్ర పరిశ్రమ ముంబయికే పరిమితమైంది’’ అని కామెంట్ చేయగా బోనీ కపూర్ దాన్ని అంగీకరించలేదు. అమితాబ్ బచ్చన్‌కు తాను పెద్ద అభిమానినని బన్నీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. దానిపై నాగవంశీ స్పందిస్తూ.. షారుక్ ఖాన్, చిరంజీవికీ అల్లు అర్జున్ పెద్ద అభిమాని అని చెప్పారు.
దీనిపై బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ గుప్తా ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా పేరుపొందిన బోనీకపూర్‌తో నాగవంశీ మాట్లాడిన తీరును ఆయన తప్పు పట్టారు. అగ్ర నిర్మాతతో ఈ విధంగా మాట్లాడటం సరికాదన్నారు. టాలీవుడ్‌కు చెందిన సీనియర్స్‌తోనూ ఇలాగే ప్రవర్తిస్తారా? అని ప్రశ్నించారు. ‘‘బోనీకపూర్ లాంటి సీనియర్ నిర్మాత పక్కన కూర్చొని తన వ్యాఖ్య?తో ఆయన్ని ఎగతాళి చేస్తున్న ఈ వ్యక్తి ఎవరు? అతడి వైఖరి ఏమీ బాలేదు. నాలుగు హిట్స్ అందుకున్నంత మాత్రాన అతడు బాలీవుడ్‌కు రాజు కాలేడు. టాలీవుడ్‌కు చెందిన సీనియర్ నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్‌బాబు వంటి వారితోనూ ఇదే విధంగా మాట్లాడగలడా? విజయం అందుకోవడం మాత్రమే కాదు.. గౌరవం ఇవ్వడం కూడా నేర్చుకోవాలి’’ అని మండిపడ్డారు.
అనంతరం సంజయ్ మరో పోస్ట్ పెట్టారు. ‘పుష్ప 2’ చిత్రం రూ.86 కోట్లు వసూలు చేసిన తర్వాత బాలీవుడ్ మొత్తం నిద్రపోలేదు’ అని నాగవంశీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సంజయ్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ‘‘మా ఎగ్జిబిటర్ల వల్లే ఆ సినిమా రూ.86 కోట్లు కలెక్ట్ చేసిందని తెలిసి మేము చాలా ప్రశాంతంగా నిద్రపోయాం. మేము మీలా కాదు. ఎదుటివాళ్ల విజయం మాకు నిద్ర లేని రాత్రులు ఇవ్వదు’’ అని అన్నారు. సంజయ్ మాత్రమే కాకుండా బాలీవుడ్‌కు చెందిన పలువురు దర్శక, నిర్మాతలు నాగవంశీ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. తనపై వస్తున్న వ్యాఖ్యలపై నిర్మాత నాగవంశీ స్పందించారు. "బోనీకపూర్ అంటే తనకెంతో గౌరవం ఉంది. పెద్దలను ఎలా గౌరవించాలో మీరు నేర్పాల్సిన అవసరం లేదు. మీకంటే ఎక్కువగా మేము బోనీ కపూర్‌ను గౌరవిస్తాంం. ఆయన్ని అగౌరవపరిచేల నేను మాట్లాడలేదు. ఇది ఆరోగ్యకరమైన చర్చ. మేమిద్దరం చక్కగా నవ్వుతూ మాట్లాడుకున్నాం. ఇంటర్వ్యూ తర్వాత పరస్పరం ఆలింగనం చేసుకున్నాం. కాబట్టి దయచేసి మీరు ఇలాంటివి చూసి ఒక ఆలోచనకు రాకండి’’ అని పేర్కొన్నారు. తాజాగా మరోసారో క్లారిటీ ఇచ్చారు.