Virat Karrna: 'నాగబంధం' పాట కోసం భారీ సెట్
ABN , Publish Date - Feb 21 , 2025 | 05:31 PM
విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'నాగబంధం' కోసం ఓ డాన్స్ నంబర్ ను ప్రస్తుతం రామానాయుడు స్టూడియోలో వేసిన సెట్ లో చిత్రీకరిస్తున్నారు.
'పెదకాపు' సినిమాతో ప్రముఖ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి బావమరిది విరాట్ కర్ణ (ViratKarrna) హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా... అతనితో ఇప్పుడు అభిషేక్ అగర్వాల్ 'నాగబంధం' (Naga Bandham) పేరుతో పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు కిశోర్ అన్నపురెడ్డి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. నభా నటేశ్ (Nabha Natesh), ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలోని ఓ డాన్స్ నంబర్ కోసం నానక్ రామ్ గూడాలోని రామానాయుడు స్టూడియోస్ లో ఓ భారీ సెట్ ను వేశారు. హీరోహీరోయిన్లపై ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు ప్రముఖ బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య (Ganesh Acharya) కొరియోగ్రఫీ అందిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అభే బ్లాక్ బస్టర్ నెంబర్‌ను కంపోజ్ చేశారని దీనిని కాలభైరవ, అనురాగ్ కులకర్ణి, మంగ్లీ తమ ఎనర్జిటిక్ వోకల్స్ తో ఆలపించారని మేకర్స్ తెలిపారు. ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు.
‘ది సీక్రెట్ ట్రెజర్’ అనే ట్యాగ్‌లైన్‌తో ‘నాగబంధం’ ఒక ఎపిక్ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటోంది. 'నాగబంధం' సినిమా పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ దేవాలయాల వద్ద ఇటీవల కనుగొనబడిన గుప్త నిధుల నేపథ్యంలో ఉండబోతోంది. భారతదేశంలోని విష్ణు దేవాలయల చుట్టూ ఉన్న రహస్యాన్ని 'నాగబంధం'లో చూపించబోతున్నారు.