Gaddar film Awards: స్పెషల్ అవార్డ్స్ సెలక్షన్ టీమ్ ఇదే...

ABN , Publish Date - May 15 , 2025 | 04:57 PM

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ స్పెషల్ అవార్డుల కోసం మురళీమోహన్ చైర్మన్ గా తెలంగాణ ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ ఈ నెల 25న ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది.

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు 2024 కోసం జయసుధ నేతృత్వంలో ఏర్పాటు చేసిన జ్యూరీ సభ్యులు కొద్ది రోజులుగా సినిమాలను వీక్షిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పినట్టుగా 2014 నుండి 2023 వరకూ యేడాది ఒక ఉత్తమ చిత్రం చొప్పున ఎంపిక చేయడానికి మరో కమిటీని వేసింది. ఈ కమిటీ ఉత్తమ చిత్రాలతో పాటు స్పెషల్ అవార్డ్స్ అర్హులను సైతం ఎంపిక చేస్తుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్టీఆర్ జాతీయ అవార్డును ఇప్పుడు కూడా ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. అలానే రఘుపతి వెంకయ్య అవార్డును, బి.ఎన్. రెడ్డి, నాగిరెడ్డి - చక్రపాణి అవార్డులను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ అవార్డులతో పాటు తెలంగాణ ప్రభుత్వం అదనంగా పైడి జయరాజ్ పేరుతోనూ, కాంతారావు పేరుతోనూ కూడా అవార్డులను ఇవ్వాలని నిర్ణయించింది. సో... ఇప్పుడు మురళీమోహన్ ఛైర్మన్ గా ఉన్న కమిటీ ఈ అవార్డులకు కూడా అర్హులను ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో దర్శకుడు కె. దశరథ్‌, నిర్మాత డి.వి.కె. రాజు, నటి ఊహ, సీనియర్ జర్నలిస్ట్ ఉమామహేశ్వరరావు, నర్తకి వనజా ఉదయ్, దర్శకుడు కూచిపూడి వెంకట్, కె. శ్రీధర్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎం.డి. కూడా సభ్యుడిగా వ్యవహరిస్తారు.

gaddar.jpeg.jpg


అలానే తెలంగాణ ప్రభుత్వం 2024కి గానూ ఉత్తమ సినిమా గ్రంధం అవార్డును కూడా ఇవ్వదలుచుకుంది. ఇందుకోసం సీనియర్ జర్నలిస్ట్ భగీరథతో పాటు వడ్లమాని కనకదుర్గ, వి. మధుసూదన్ తో ఓ కమిటీని వేసింది. గద్దర్ అవార్డ్స్ ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ఈ మూడు కమిటీలు తమ నివేదికను ఈ నెల 25న ప్రభుత్వానికి అందచేయ బోతున్నాయి. జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా హైటెక్స్ లో నిర్వహించబోతోంది.

Also Read: Kamal Haasan: థగ్ లైఫ్ కొత్త అప్డేట్ ఇదే 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 16 , 2025 | 04:34 PM