Mohan Babu: భక్తవత్సలం నాయుడు నట స్వర్ణోత్సవం
ABN , Publish Date - Mar 19 , 2025 | 04:34 PM
విలక్షణ నటుడు అని మాత్రమే కాదు వాచకంలో మిన్న అనిపించుకున్నారు నటుడు మోహన్ బాబు. 'స్వర్గం - నరకం'తో వెండితెరపై నాయకుడిగా నటించిన మోహన్ బాబుకు ఇది స్వర్ణోత్సవ సంవత్సరం
నటప్రపూర్ణ డాక్టర్ మోహన్ బాబు (Mohan Babu) మార్చి 19తో 79 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. మరో యేడాది పూర్తయితే 'సహస్ర చంద్రదర్శనం' చూసిన వారవుతారు. విలక్షణమైన అభినయంతో అనేక వైవిధ్య పాత్రల్లో జీవించిన మోహన్ బాబు నటునిగానే కాదు, నిర్మాతగానూ తనదైన బాణీ పలికించారు. 500 పైగా చిత్రాల్లో నటించిన మోహన్ బాబు ఈ యేడాది నవంబర్ 22న నటునిగా యాభై ఏళ్ళు పూర్తిచేసుకోబోతున్నారు. అంతకు ముందు 'అల్లూరి సీతారామరాజు, కన్నవారి కలలు' వంటి చిత్రాల్లో బిట్ రోల్స్ లో కనిపించిన మోహన్ బాబు 1975లో దాసరి తెరకెక్కించిన 'స్వర్గం-నరకం' (Swargam Narakam)లో ఓ హీరోగా నటించారు. అప్పటి దాకా భక్తవత్సలం నాయుడు (Bhakta Vatsalam Nayudu)గా సాగిన ఆయనను మోహన్ బాబుగా జనంముందు నిలిపింది 'స్వర్గం-నరకం' చిత్రమే! నాటి నుండి నేటి దాకా తన దరికి చేరిన పాత్రల్లో అలరించడానికి మోహన్ బాబు సదా సిద్ధంగానే ఉన్నానని చాటుకుంటున్నారు. రెండేళ్ళ క్రితం 'శాకుంతలం'లో దుర్వాస మహర్షిగా తనదైన రీతిలో మెప్పించిన మోహన్ బాబు త్వరలోనే 'కన్నప్ప'లో మహాదేవ శాస్త్రిగా పలకరించనున్నారు. తన తనయుడు మంచు విష్ణు హీరోగా రూపొందుతోన్న 'కన్నప్ప'లో మోహన్ బాబు పాత్ర కీలకమైంది. ఏప్రిల్ 25న 'కన్నప్ప' ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటి దాకా 35 చిత్రాలను నిర్మించిన నటనిర్మాత మరొకరు కానరారు. సొంత చిత్రాలతోనే స్టార్ డమ్ చూసిన హీరోలుగా కృష్ణ, కృష్ణంరాజు నిలిచారు. వారి బాటలోనే పయనిస్తూ 1982లో మోహన్ బాబు నిర్మాతగా మారారు. తొలి ప్రయత్నంగా బోయిన సుబ్బారావు దర్శకత్వంలో 'ప్రతిజ్ఞ' (Pratignya) నిర్మించి హీరోగా నటించారు. నటరత్న యన్టీఆర్ చేతుల మీదుగా ఆరంభమైన మోహన్ బాబు తొలి చిత్రం మంచి విజయం సాధించింది. ఆయన బ్యానర్ శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ కు మంచి గుర్తింపు లభించింది. తరువాత "ధర్మ పోరాటం, భలే రాముడు, పద్మవ్యూహం, వీరప్రతాప్" చిత్రాలు నిర్మించారు. వాటిలో జానపద చిత్రం 'వీరప్రతాప్' ఎంతో నిరాశ పరచింది. సొంత చిత్రాలకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కమెడియన్ గా, కామెడీ విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా సాగారు. ఈ దశలో మళ్ళీ మోహన్ బాబు లోని నటునికి వరుసగా అవకాశాలు వెదుక్కుంటూ వచ్చాయి. తరువాత తన గురువు దాసరి నారాయణ రావు దర్శకత్వంలో మోహన్ బాబు నటించి నిర్మించిన 'నా మొగుడు నాకే సొంతం' మంచి విజయం సాధించింది. ఆ పై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించి నటించిన 'అల్లుడుగారు' ఘనవిజయం సొంతం చేసుకుంది. ఇక అప్పటి నుంచీ మళ్ళీ హీరోగా సాగుతూ అభిమానులను అలరించారు మోహన్ బాబు.
అనేక విషయాల్లో నటరత్న యన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకొనే మోహన్ బాబు ఆయనతోనే ఓ సినిమా నిర్మించాలని ఆశించారు. యన్టీఆర్ కూడా అంగీకరించడంతో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'మేజర్ చంద్రకాంత్' నిర్మించి నటించారు మోహన్ బాబు. యన్టీఆర్ నటించిన చివరి చిత్రంగా 'మేజర్ చంద్రకాంత్' నిలచిపోయింది. 1993లో ఘనవిజయం సాధించి బ్లాక్ బస్టర్ గా నిలచింది 'మేజర్ చంద్రకాంత్'. 1995లో మోహన్ బాబు నిర్మించి ద్విపాత్రాభినయం చేసిన 'పెదరాయుడు' ఇండస్ట్రీ హిట్ గా జయకేతనం ఎగురవేసింది. ఆ తరువాత కూడా అనేక చిత్రాలలో మోహన్ బాబు నటిస్తూసాగారు. ఆయన 500వ చిత్రంగా 'రాయలసీమ రామన్న చౌదరి' రూపొందింది. ఓ వైపు నటనిర్మాతగా సాగుతూనే మరోవైపు 'శ్రీవిద్యానికేతన్'ద్వారా విద్యారంగంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు మోహన్ బాబు. యన్టీఆర్ ఆయనను రాజ్యసభ సభ్యుని చేశారు. తరువాత కేంద్రప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో మోహన్ బాబును గౌరవించింది. రాబోయే రోజుల్లోనూ మోహన్ బాబు నటనిర్మాతగా తనదైన బాణీ పలికిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read: Vijay Devarakonda: కింగ్ డమ్ టీజర్ ఓ.ఎస్.టి.కి హ్యూజ్ రెస్పాన్స్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి