Dragon: కాయాదు అంత పని చేసిందేమిటీ!?
ABN , Publish Date - Feb 25 , 2025 | 09:46 AM
అస్సాంలో పుట్టి, పూణేలో ఉంటున్న కాయాదు లోహర్ దక్షిణాది చిత్రాలలో కథానాయికగా రాణిస్తోంది. తాజాగా 'డ్రాగన్' చిత్రంలో నటించిన ఆమె పీ.ఆర్. విషయంలో తగ్గేదే లే అంటోంది.
మూడేళ్ళ క్రితం శ్రీవిష్ణు (Srivishnu) 'అల్లూరి' (Alluri) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కాయాదు లోహర్ (Kayadu Lohar). అయితే ఆ మూవీ పరాజయం పాలు కావడంతో ఆమెపై ఏ దర్శక నిర్మాత దృష్టి పెట్టలేదు. కానీ కాయాదు లోహర్ మాత్రం ఇతర భాషల్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగుతోంది.
విశేషం ఏమంటే... ఫిబ్రవరి 21న విడుదలైన తమిళ అనువాద చిత్రం 'రిటర్న్ ఆఫ్ డ్రాగన్' (Return of the Dragon) మూవీలో కాయాదు లోహర్ కీలక పాత్ర పోషించింది. 'లవ్ టుడే' (Love today) ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Raganadhan) హీరోగా నటించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ (Anupama Prameswaran) కూడా యాక్ట్ చేసింది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా... 'లవ్ టుడే' కాన్సప్ట్ ను రిపీట్ చేస్తూ, హీరో హీరోయిన్ల ఫోన్లను యాంకర్ మార్చుకోమని చెప్పింది. అయితే... కాయాదు లోహర్ సెల్ లో ఉన్న ఓ యాప్ చూసి... ప్రదీప్ రంగనాథన్ ఆశ్చర్యానికి గురయ్యాడట. ఆమె ఫోన్ లో మీమ్స్ మేకింగ్ యాప్ ఉందట. సహజంగా సినిమా ఆర్టిస్టులను ప్రమోట్ చేయడానికి పీ.ఆర్. టీమ్ మీమ్స్ చేసి... సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ స్వయంగా కాయాదు లోహరే తన మీమ్స్ ను తయారు చేసుకుంటోందని ప్రదీప్ కు అర్థమైంది. అదే విషయాన్ని ఆమెను అడిగితే.. 'అవును నా మీద మీమ్స్ నేనే చేసుకుంటాను. అందులో తప్పేముంది!? ఓ పొజిషన్ కు మనం చేరాలంటే... ముందు మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. అది జరుగుతుందా? లేదా? అనేది తర్వాత సంగతి... మనల్ని మనం అలా మోటివేట్ చేసుకుని ప్రమోట్ చేసుకోవడం తప్పే కాదు'' అని చెప్పిందట. ఇంతకూ విషయం ఏమిటంటే... ఆమె తన మీద చేసిన మీమ్ లో 'రాబోయే రోజుల్లో తెలుగు హవా చూపబోతున్న కాయాదు లోహర్' అని ఉందట.
నిజానికి ఇవాళ పీ.ఆర్. టీమ్ మీద పూర్తి భారం వేయకుండా హీరోలు, హీరోయిన్లు ఇలా సొంతంగా ఏదో ఒక స్ట్రేటజీని ప్లే చేసి, వార్తల్లోనూ, సోషల్ మీడియాలోనూ నానుతూ ఉన్నారు. అయితే... వీటిని పట్టించుకోని హీరోలు నటించిన సినిమాలు ఎంత బాగున్నా, ఎంత కలెక్షన్స్ వచ్చినా... ఫలితంలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై మన తెలుగు యువ హీరోలు కొందరు ఇటీవల వాపోయారు కూడా. ఏదేమైనా... కాయాదు లోహర్ కోరుకున్నట్టుగా రాబోయే రోజుల్లో ఆమె టాలీవుడ్ లో తన సత్తాను చాటుతుందనేమో చూడాలి.