Chiranjeevi Wishes Lokesh: లోకేష్ బర్త్ డే.. చిరు స్పెషల్ విషెస్
ABN , Publish Date - Jan 23 , 2025 | 11:49 AM
ఏపీ మంత్రి నారా లోకేష్‌కు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ చిరు ఏమన్నారు? ప్రాధాన్యత సంతరించుకునే రేంజ్‌లో అసలు ఏం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియాజేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయనకు విషెస్ చెబుతూ.. 'X' వేదికగా ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడి వైరల్ గా మారింది. విషెస్ చెప్పడంలో అంతా ప్రత్యేకత ఏముంది అంటారా? ఉంది, అదేంటంటే..
ప్రస్తుతం ఏపీలో డిప్యూటీ సీఎంగా లోకేష్ పదవి చేపట్టనున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య మంటలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ సోదరుడు ట్వీట్ చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చిన మంటలు చల్లారడం లేదు. ఈ సారి చిరు పుట్టినరోజు ట్వీట్ చేయడంతో ఇరు పార్టీల శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
చిరు ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. ‘‘తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ నిర్విరామ కృషి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మీ తపన ఎంతో హర్షణీయం. మీ ప్రయత్నాలన్నీ విజయం సాధించాలని కోరుకుంటున్నా. పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ లోకేశ్’’ అని రాసుకొచ్చారు. మరోవైపు లోకేష్ స్విట్జర్లాండ్ దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో బిజీగా గడుపుతున్నారు.