Manchu Vishnu: నేనేం గొప్ప పని చేయడం లేదు.. మంచు విష్ణు
ABN , Publish Date - Jan 14 , 2025 | 12:31 PM
Manchu Vishnu: నేను ఈ విషయాన్ని ప్రపంచంతో పంచుకోవాలని అనుకోలేదు. కానీ, ఇలాంటివి ప్రపంచానికి తెలియాలని ఇప్పుడు అనిపించింది.
ఎప్పుడు వివాదాలు, కాంట్రవర్సీలు, ట్రోలింగ్స్ తో వార్తల్లో నిలిచే మంచు ఫ్యామిలీ ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే మంచు లక్ష్మి తెలంగాణ రాష్ట్రలో పేద విద్యార్థులకు నాణ్యతమైన విద్యను అందించేందుకు ఎంతో కృషి చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మంచు విష్ణు కూడా తిరుపతిలో ఎందరికో ఆదర్శంగా నిలిచే పని చేశాడు. తాజాగా ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సోమవారం హీరో మంచు విష్ణు.. తిరుపతి బైరాగిపట్టెడలోని మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. విష్ణు భోగి పండగ కూడా ఆ పిల్లలతోనే సెలబ్రేట్ చేసుకున్నాడు. తాజాగా ఆయన 'X' ఖాతా ద్వారా పోస్టు చేస్తూ.. ‘‘నేను ఏడాదిన్నర క్రితమే 120 మంది పిల్లలను దత్తత తీసుకున్నాను. అప్పటినుంచి వారిని చదివిస్తున్నాను. వారి బాగోగులు చూస్తున్నాను. పండుగలన్నీ వారితో కలిసి ఆనందంగా చేసుకుంటున్నా. నేను ఈ విషయాన్ని ప్రపంచంతో పంచుకోవాలని అనుకోలేదు. కానీ, ఇలాంటివి ప్రపంచానికి తెలియాలని ఇప్పుడు అనిపించింది. నేనేం గొప్ప పని చేయడం లేదు. సమాజం కోసం నాకు తోచింది చేస్తున్నా. ఇది మీలో స్ఫూర్తి నింపాలని.. మీరు కూడా ఇలాంటి పనులు చేయాలని ఆశిస్తున్నా. భోగి పండుగను ఆ పిల్లలతో కలిసి చేసుకున్నా. ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. ఆ పిల్లల చిరునవ్వులే నాకు ఆశీర్వాదాలు. ఆ పిల్లలు ఉన్నత స్థానాలకు వెళ్లి మరికొందరికి సాయం చేసే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా’’ అని రాసుకొచ్చారు.