ప్రభాస్ 'స్పిరిట్'లో మంచు విష్ణు.. కామెడీ మామూలుగా లేదుగా...

ABN , Publish Date - Feb 15 , 2025 | 04:14 PM

తాజాగా మంచు విష్ణు ఎక్స్ లో పెట్టిన పోస్ట్ ఒకటి ఇటు మంచు ఫ్యామిలీని, అటు ప్రభాస్ ఫ్యాన్స్ ను మరోసారి ఆకర్షించింది.

మంచు మోహన్ బాబు (Mohan Babu) నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'కన్నప్ప' (Kannappa) ఏప్రిల్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. మంచు విష్ణు (Manchu Vishnu) టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా 'ఓం భీమ్ బుష్' ఫేమ్ ప్రీతి ముకుందన్ (Preethi Mukundan) నటిస్తోంది. అక్షయ్ కుమార్ (Akashay Kumar) శివుడిగా, కాజల్ (Kajal) పార్వతీ దేవిగా వెండితెరపై మెరియబోతున్నారు. అలానే మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్ (Mohanlal), శరత్ కుమార్ (Sarath Kumar), బ్రహ్మానందం (Brahmanandam) తదితరులు కీలక పాత్రలు పోషించారు. వీరంతా ఒక ఎత్తు అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఈ సినిమాలో రుద్రుడు పాత్రను పోషించారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్  సైతం ఇటీవల విడుదలైంది. దాంతో  ప్రభాస్ అభిమానులంతా... 'కన్నప్ప' సినిమాలో ప్రభాస్ నటించడం ఎందుకు? ఒక పక్క క్రేజీ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ ప్రభాస్ ఇలా అతిథి పాత్ర చేయడం ఎంతవరకూ సబబు అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయమై చర్చకూడా జరుగుతోంది.

చాలా సంవత్సరాల క్రితం బాపు (Bapu) దర్శకత్వంలో కృష్ణంరాజు (Krishnam Raju), వాణిశ్రీ (Vanisri) జంటగా 'భక్త కన్నప్ప' చిత్రం రూపుదిద్దుకుంది. దానికి కృష్ణంరాజే నిర్మాత. ఆ సినిమా ఘన విజయం సాధించడమే కాదు మ్యూజికల్ గానూ గొప్ప సినిమాగా నిలిచింది. నిజానికి కన్నప్ప కథను కృష్ణంరాజు తన నట వారసుడు ప్రభాస్ తో తెరకెక్కించాలని కలలు కన్నారు. అలానే తనికెళ్ళ భరణి సైతం ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకునే కన్నప్ప సినిమా కథను కొత్తగా రాసుకున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్ళలేదు కానీ... ఈలోగా మంచు విష్ణు ప్రోద్భలంతో మోహన్ బాబు పాన్ ఇండియా మూవీగా 'కన్నప్ప' ను మొదలు పెట్టి పూర్తి చేశారు. దాదాపు సినిమా మొత్తం న్యూజిలాండ్ లోనూ చిత్రీకరణ జరుపుకుంది. అతి తక్కువ సన్నివేశాలు, ప్యాచ్ వర్క్ ను మాత్రం ఇక్కడ తీశారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేశ్‌ కుమార్ సింగ్ దీనిని తెరకెక్కించాడు.


ఇదిలా ఉంటే... తాజాగా మంచు విష్ణు ఎక్స్ లో పెట్టిన పోస్ట్ ఒకటి ఇటు మంచు ఫ్యామిలీని, అటు ప్రభాస్ ఫ్యాన్స్ ను మరోసారి ఆకర్షించింది. ప్రస్తుతం ప్రభాస్ 'రాజా సాబ్ (Raja Saab) , సలార్ -2' (Salaar-2) తో పాటు 'స్పిరిట్' (Spirit) మూవీకీ అంగీకారం తెలిపాడు. దీనిని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నాడు. అతనికి చెందిన భద్రకాళి ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవల ఈ సంస్థ తమ చిత్రంలో నటించేందుకు ఆసక్తి ఉన్నవారు వివరాలను పంపవలసిందిగా సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. దానికి సమాధానంగా.... 'స్పిరిట్' సినిమాలో నటించేందుకు తాను కూడా అప్లయ్  చేశానని, అవకాశం వస్తుందో రాదో వేచి చూడాలి' అంటూ విష్ణు దానిని రీ-పోస్ట్  చేశాడు. దాంతో 'స్పిరిట్'లో మంచు విష్ణు కూడా ఏమైనా అతిథి పాత్ర చేస్తాడా? లేకపోతే కీలకమైన పాత్ర చేయబోతున్నాడా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండూ కాదు... విష్ణు సరదాగా ఈ పోస్ట్ పెట్టాడని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా.. మంచు విష్ణు పెట్టిన ఈ పోస్ట్ కారణంగా... అటు 'కన్నప్ప' గురించి ఇటు 'స్పిరిట్' మూవీ గురించి కూడా చర్చమొదలైంది.

Updated Date - Feb 15 , 2025 | 04:36 PM