Manchu Manoj: నా వైపు మాత్రమే నిజం ఉంది.. ఆధారాలున్నాయి

ABN , Publish Date - Feb 14 , 2025 | 02:55 PM

మోహన్‌బాబుకు చెందిన విద్యాసంస్థల సమీపంలో ఉన్న ఒక రెస్టారెంట్‌పై దాడి జరిగిన ఘటన గురించి   మంచు మనోజ్‌ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. దాడిని ఖండించిన ఆయన ఈ విషయంపై అధికారులు దృష్టి సారించాలని కోరారు

మోహన్‌బాబుకు (Mohan Babu) చెందిన విద్యాసంస్థల (MBU) సమీపంలో ఉన్న ఒక రెస్టారెంట్‌పై దాడి జరిగిన ఘటన గురించి  మంచు మనోజ్‌ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. దాడిని ఖండించిన ఆయన ఈ విషయంపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. ఆయన మాట్లాడుతూ ‘‘బౌన్సర్ల సమస్య (Bouncer Fight) గురించి గతంలో నేను ఫిర్యాదు చేశాను. పోలీసు అధికారులు వెంటనే స్పందించి నాడు చర్యలు తీసుకున్నారు. అందుకు ధన్యవాదాలు. ఈ దాడి గురించి నాకు గురువారం కాల్స్‌ వచ్చాయి. బౌన్సర్లు ప్రతి ఒక్కరినీ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. గొడవైన వెంటనే సీసీ టీవీ ఫుటేజ్‌ తీసుకువెళ్లిపోయారు. హైదరాబాద్‌లో నా ఇంట్లో అయినా, బయట ఎక్కడ గొడవలు జరిగినా సీసీ టీవీ ఫుటేజ్‌లు తీసుకెళ్లిపోతుండటం విచిత్రంగా అనిపిస్తుంది. ఈ విషయమై దృష్టి పెట్టాలని స్థానిక ఎమ్మెల్యేను కోరుతున్నా. ఇక్కడి ప్రజలకు ధైౖర్యం ఇవ్వండి. పదిమందికి సాయం చేయడం కోసమే నాన్న ఈ విద్యా సంస్థలు ప్రారంభించారు. ఇప్పుడు దీని మేనేజ్‌మెంట్‌ ఎవరి చేతుల్లో ఉందో అందరికీ తెలుసు. దయచేసి బౌన్సర్లను తొలగించండి. రెస్టరెంట్‌ యజమాని ప్రాణభయంతో పారిపోయాడు.

ఆయనకు ఎన్నిసార్లు బెదిరింపులు వచ్చాయి. అలాగే ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి కొంతమంది విద్యార్థులు నాకు లేఖలు రాశారు. దీనిపై నేను ప్రశ్నించడం మొదలు పెట్టాక నాపై లేనిపోని అభాండాలు వేస్తున్నారు. పైగా వాటిని కుటుంబ వివాదాలు అని చెబుతున్నారు. నా కుటుంబంలోని మహిళలను టార్గెట్‌ చేశారు. ఈ వ్యవహారంలో నా వైపు మాత్రమే నిజం ఉంది. ఒక్క ప్రూఫ్‌ ఉన్నా ఇవ్వమనండి. నేను నా వద్ద ఉన్న ఆధారాలన్నీ ధైర్యంగా చూపిస్తా. ఇది ఆస్తి గొడవ కాదు. ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం’’ అని మనోజ్‌ అన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 02:57 PM