Naga Vamsi: పంపిణీదారుల అభ్యర్థనతో 'మ్యాడ్ స్క్వేర్' ముందుకు..

ABN , Publish Date - Mar 02 , 2025 | 02:38 PM

నార్నె నితిన్, రామ్‌ నితిన్‌, సంగీత్‌ శోభన్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ (MADSquare). దీని రిలీజ్‌ డేట్‌లో మార్పులు జరిగినట్లు చిత్ర నిర్మాత నాగవంశీ (Naga Vamsi) తాజాగా ప్రకటించారు.

 

హిట్ సినిమా 'మ్యాడ్'కి (Mad)సీక్వెల్ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్' (MADSquare). ఇటీవల విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని, ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ఈ చిత్రానికి సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. మార్చి 29న విడుదల కావాల్సి ఉండగా, డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకు ఒక రోజు ముందుగా మార్చి 28 శుక్రవారం నాడు విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. 

'మ్యాడ్ స్క్వేర్' సినిమాని ఒకరోజు ముందుగా విడుదల చేస్తుండటంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi) స్పందిస్తూ, "మా పంపిణీదారుల అభ్యర్థన మరియు మద్దతుతో 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం ఒక రోజు ముందుగా మార్చి 28వ తేదీన వస్తుంది. చివరి నిమిషంలో విడుదల తేదీ మార్చాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదు. మార్చి 29న అమావాస్య కావడంతో, మా పంపిణీదారులు విడుదలను ముందుకు తీసుకెళ్లడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు.  'మ్యాడ్ స్క్వేర్'తో పాటు మార్చి 28న విడుదల కానున్న 'రాబిన్‌హుడ్' (robinhood) చితం కూడా ఘన విజయం సాధించాలని మనస్ఫూరిగా కోరుకుంటున్నాను. ఈ వేసవికి నవ్వుల పండుగ రాబోతుంది." అన్నారు. 

మ్యాడ్ సినిమాలో తనదైన ప్రత్యేక శైలి హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్, ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరియు విష్ణు ఓఐ.. 'మ్యాడ్ స్క్వేర్'లో అంతకుమించిన అల్లరి చేయబోతున్నారు. రెబా జాన్ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారు. కె.వి. అనుదీప్, ప్రియాంక జవాల్కర్ తదితరులు కీలక పాత్రలలో అలరించనున్నారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.  

Updated Date - Mar 02 , 2025 | 02:44 PM