MohanLal: ‘ఎల్ 2: ఎంపురాన్’ వివాదం.. మోహన్‌లాల్ స్పందన ఏంటంటే..
ABN , Publish Date - Mar 30 , 2025 | 05:01 PM
మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ‘ఎల్ 2: ఎంపురాన్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసింది. అయితే ఈ చిత్రం వివాదంతో చిక్కుతుంది. రిలీజ్ తర్వాత చోటుచేసుకున్న వివాదంపై మోహన్‌లాల్ స్పందించారు.
మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ‘ఎల్ 2: ఎంపురాన్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసింది. అయితే ఈ చిత్రం వివాదంతో చిక్కుతుంది. రిలీజ్ తర్వాత చోటుచేసుకున్న వివాదంపై మోహన్‌లాల్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెబుతూ పోస్టు పెట్టారు. ‘‘రాజకీయం, సామాజిక అంశాలు కొన్ని ‘ఎల్2: ఎంపురాన్’లో భాగమయ్యాయి. నాకు ప్రియమైన కొందరిని అవి బాధించాయి. నా సినిమాలు ఏ రాజకీయ ఉద్యమాన్ని, భావజాలాన్ని, మతాన్ని కించపరచకుండా చూడడం ఓ నటుడిగా నా బాధ్యత. అందుకే నా, చిత్ర బృందం తరఫున క్షమాపణలు చెబుతున్నా. సంబంధిత సన్నివేశాలను సినిమా నుంచి తొలగించాలని మేం నిర్ణయించుకున్నాం. గత నాలుగు దశాబ్దాలుగా మీ అందరిలో ఒకడిగా ఉంటున్నా. మీ ప్రేమ, నమ్మకమే నా బలం’’ అని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి పోస్ట్‌లో పేర్కొన్నారు. వివాదం నెలకొన్న నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్ ‘ఎంపురాన్’ సినిమాని కుటుంబంతో కలిసి చూశారు. చిత్ర బృందానికి మద్దతు ఇచ్చారు. భావ స్వేచ్ఛా ప్రకటన ను కాపాడుకోవాలని ఆయన అన్నారు.
అసలు ఏం జరిగిందంటే..
2002లో గుజరాత్‌లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఇందులో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. అల్లర్ల సమయంలో ఓ కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు దారుణంగా హత్య చేయడం.. కొంత కాలానికి అతడే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వంటి అంశాలతో సాగిన ఈ సన్నివేశాలను పలువురు తప్పుపట్టారు. ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా ఈ సీన్స్ ఉన్నాయని వివాదం సృష్టించారు. ఈ చిత్రాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే నిర్మాత గోకులం గోపాలన్ స్పందించగా.. తాజాగా మోహన్‌లాల్ ఫేస్‌బుక్ వేదికగా స్పందించారు.