Keerthy Suresh: మహానటి ప్రేమాయణం ఇప్పటిది కాదు..
ABN , Publish Date - Jan 02 , 2025 | 10:23 AM
తన చిరకాల మిత్రుడు, ప్రేమికుడు ఆంటోనీ తటిల్‌తో ఏడడుగులు వేశారు కీర్తి సురేష్. వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.
ఇంటర్ చదువుతుండగా ప్రేమలో పడింది..
15 ఏళ్లగా అతనితో ప్రేమలో ఉంది..
2010లో ప్రామిస్ రింగ్‌తో ప్రపోజల్..
2017లో సోలోగా విదేశాలకు ట్రిప్ వేశారు..
2022లో పెళ్లాడాలనే నిర్ణయం..
2024 డిసెంబర్‌లో ఏడడుగులు వేశారు..
ఇదీ మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రేమాయణం..
తన చిరకాల మిత్రుడు, ప్రేమికుడు ఆంటోనీ తటిల్‌తో (Antony Tatil) ఏడడుగులు వేశారు కీర్తి సురేష్(Keerthy Sureshn Marriage). వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి తన ప్రేమ, పెళ్లి గురించి విశేషాలను షేర్ చేసుకుంది. 12వ తరగతి చదువుతున్నప్పుడే తాను ఆంటోనీతో ప్రేమలో పడినట్లు తెలిపిన ఆమె 15 ఏళ్ల నుంచి ప్రేమించుకున్నట్లు చెప్పారు. నా పెళ్లి ఇప్పటికీ ఓ కలలా ఉంది. నా హృదయం భావోద్వేగంతో నిండిన క్షణాలవి. మా వివాహం కోసం మేమిద్దరం ఎప్పటినుంచో కలలు కన్నాం. మేము 12వ తరగతిలో ఉన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నాం. ఆంటోనీ నాకంటే ఏడేళ్లు పెద్ద. ఆరేళ్ల నుంచి ఖతార్‌లో వర్క్ చేస్తున్నాడు. నా కెరీర్‌కు చాలా సపోర్ట్ ఇస్తాడు. ఆంటోనీ నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం. Keerthy SUresh weds Antony Tatil)
మొదట ప్రపోజ్ ఎలాగంటే..
అంటోనితో ఉన్న పరిచయం కొద్దీ నెల రోజులు సరదాగా గడిపాం. తర్వాత నేను మా కుటుంబంతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లా. అక్కడికి ఆంటోనీ వచ్చాడు. కుటుంబంతో కలిసి ఉండేసరికి అతడిని కలిసే అవకాశం రాలేదు. కనుసైగ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ధైర్యం ఉంటే నాకు ప్రపోజ్ చేయమని అప్పుడు చెప్పా. 2010లో ఆంటోనీ నాకు మొదటిసారి ప్రపోజ్ చేశాడు. 2016 నుంచి మా బంధం మరింత బలపడింది. నాకు ప్రామిస్ రింగ్‌ను బహుమతిగా ఇచ్చాడు. మేము పెళ్లి చేసుకునే వరకు దాన్ని నేను తీయలేదు. నా సినిమాల్లో కూడా మీరు ఆ రింగ్‌ను గమనించవచ్చు.
నా లవ్‌స్టోరీ కొందరికే తెలుసు..
అయితే పెళ్లి ఫిక్స్ అయ్యేవరకు మా ప్రేమను ప్రైవేటుగానే ఉంచాలని నిర్ణయించుకున్నాం. నేను ఆంటోనీతో ప్రేమలో ఉన్నట్లు నా సన్నిహితులకు, ఇండస్ట్రీలో కొందరికి మాత్రమే తెలుసు. సమంత, విజయ్, అట్లీ, ప్రియా, ప్రియదర్శన్, ఐశ్వర్యలక్ష్మి.. ఇలా కొద్దిమందికి మాత్రమే మా ప్రేమ విషయం తెలుసు. మేమిద్దరం మా వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతాం.
ఇన్నేళ్ల ప్రేమలో ఒకటే ట్రిప్..
ఆంటోనీకి సిగ్గు ఎక్కువ. మీడియా ముందు కూడా అందుకే కలిసి కనిపించలేదు. చేతులు పట్టుకొని నడవడం అలాంటివి చేయలేదు. ఎన్నో సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నా 2017లో మొదటిసారి విదేశాలకు కలిసి వెళ్లాం. రెండేళ్ల క్రితమే సోలో ట్రిప్‌కు వెళ్లాం. 2022 నుంచి పెళ్లి చేసుకోవాలనుకున్నాం.
త్వరలో మంగళసూత్రాలు వేసుకుంటా..
2024 డిసెంబర్‌లో వివాహబంధంతో ఒక్కటయ్యాం. నేను పెళ్లి అయిన దగ్గర నుంచి పసుపుతాడుతోనే సినిమా ప్రచారాల్లో పాల్గొంటున్నా. ఇది చాలా పవిత్రమైనది, శక్తిమంతమైనది. మంచి ముహూర్తం చూసి మంగళసూత్రాలను బంగారు గొలుసులోకి మార్చుకుంటా.