Vishwak Sen: కాయదు లోహర్ పంట పండింది...

ABN , Publish Date - Feb 27 , 2025 | 03:24 PM

శ్రీవిష్ణు 'అల్లూరి' సినిమాతో తొలిసారి తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన కాయదు లోహర్... ఇప్పుడు మరో స్ట్రయిట్ తెలుగు సినిమా ఛాన్స్ దక్కించుకుంది. ఈసారి అమ్మడు విశ్వక్ సేన్ సరసన నటించబోతోంది.

మూడేళ్ళ క్రితం శ్రీవిష్ణు (Sreevishnu) మూవీ 'అల్లూరి'లో నటించిన కాయదు లోహర్ (Kayadu Lohar) తాజాగా 'రిటర్న్ ఆఫ్‌ ది డ్రాగన్' మూవీతో మరోసారి తెలుగువారిని పలకరించింది. ఈ సారి ఈ మూవీని తెలుగువాళ్ళు బాగానే ఆదరించారు. తమిళ డబ్బింగ్ సినిమా అయినా... గత వారం విడుదలైన సినిమాలలో కాస్తంత ఆదరణ దీనికే లభించింది. దాంతో కాయదు లోహర్ పై మన నిర్మాతలు దృష్టి సారించారు. మరీ ముఖ్యంగా కాయదు తెలుగులో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని డైరెక్ట్ గా కాయదు చెప్పలేదు కానీ ఓ తెలుగు సినిమాలో తనకు ఛాన్స్ లభించిందని తెలిపింది.


ఈశాన్య భారత్ లో పుట్టిన కాయదు లోహర్ పెరిగింది పూణేలో. అయితే ఇప్పటికే అమ్మడు దక్షిణాది చిత్రాలను చుట్టేసింది. ఏ భాషా చిత్రంలో నటించానా ఆ భాషను నేర్చుకోవడానికి కాయదు గట్టిగా ప్రయత్నిస్తుంది. అలా ఇప్పటికే చక్కగా తమిళం మాట్లాడేస్తోంది. తెలుగులో 'అల్లూరి'లో నటించే సమయంలో కాస్తంత మన భాషనూ అర్థం చేసుకునే స్థితికి చేరింది. ఇప్పుడిప్పుడే క్యూట్ క్యూట్ గా తెలుగు పదాలను పలుకుతోంది. ఇంతకూ విషయం ఏమంటే... విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా కె.వి. అనుదీప్ (KV Anudeep) దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న 'ఫంకీ' (Funky) మూవీలో కాయదు ఛాన్స్ దక్కించుకుంది. ఇవాళ సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థలోకి ఏ హీరోయిన్ అయినా అడుగుపెడితే... వాళ్ళ జాతకం మామూలుగా ఉండటం లేదు. వరుసగా అదే బ్యానర్ లో సినిమా ఛాన్సులు దక్కడమే కాదు... కలిసొస్తే... స్టార్ హీరోల పక్కన కూడా అవకాశం లభిస్తుంటుంది. అంత గొప్ప ఛాన్స్ దక్కడం పట్ల కాయదు ఫుల్ ఖుషీలో ఉంది.


ఇటీవల విశ్వక్ సేన్ నటించిన 'లైలా' మూవీ విడుదలై ఘోర పరాజయం పాలైంది. దాంతో విశ్వక్ సేన్ కసితో కమ్ బ్యాక్ మూవీ చేయాలనే తలంపుతో ఉన్నాడు. అలానే కె.వి. అనుదీప్ సహకారంతో తెరకెక్కిన ఒకటి రెండు సినిమాలు ఇటీవల ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాయి. సో... అనుదీప్ సైతం 'జాతిరత్నాలు (Jathi Ratnalu), ప్రిన్స్'ను మించిన విజయాన్ని ఈ సారి సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇవన్నీ కూడా కాయదు లోహర్ కు పనికొచ్చే అంశాలే. 'ఫంకీ' మూవీ హిట్ అయితే... వచ్చే యేడాది కాయదు లోహర్ తెలుగులో మరిన్ని అవకాశాలు ఖచ్చితంగా అందుకుంటుంది.

Aslo Read: Coolie: గుసగుసలే నిజమయ్యాయి.. పూజా ఇన్‌..

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 27 , 2025 | 03:30 PM