Manchu Vishnu: కన్నప్ప మరోసారి వాయిదా

ABN , Publish Date - Mar 29 , 2025 | 05:13 PM

మంచు విష్ణు టైటిల్ రోల్ ప్లే చేస్తున్న 'కన్నప్ప' చిత్రం ఏప్రిల్ 25న రావాల్సి ఉంది. కానీ విఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో అది వాయిదా పడింది.

మంచు మోహన్ బాబు (Mohanbabu) ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'కన్నప్ప' (Kannappa). పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఏప్రిల్ 25న విడుదల అవుతోందని భావించిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ విషయాన్ని చిత్ర కథానాయకుడు మంచు విష్ణు తెలియచేశారు. సినిమాలో కీలకమైన సన్నివేశాలకు సంబంధించిన వి.ఎఫ్.ఎక్స్. వర్క్ పూర్తి కాలేదని, దానిని తాము అనుకున్న విధంగా పూర్తి చేయడానికి మరికొన్ని వారాల సమయం పడుతుందని విష్ణు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సినిమా కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకుల సహనానికి విష్ణు ధన్యవాదాలు తెలిపాడు. ముందు అనుకున్న తేదీకి సినిమాను తీసుకుని రాలేకపోయినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరాడు. తమ సాంకేతిక బృందం మంచి క్వాలిటీతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తోందని, వారి శ్రమకు తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుందనే నమ్మకం ఉందని విష్ణు అన్నారు. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

మంచు మోహన్ బాబు, మోహన్ లాల్ (Mohanlal) , అక్షయ్ కుమార్ (Akshay Kumar), ప్రభాస్, కాజల్ అగర్వాల్, తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్ నాయికగా నటించింది. 'కన్నప్ప' చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు.


ఇదిలా ఉంటే... మంచు విష్ణు, అతని సోదరుడు మంచు మనోజ్ (Manchu Manoj) మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గున మండే పరిస్థితి ఉంది. దాంతో ఆ మధ్య ఓ సందర్భంగా మనోజ్ తాను కీలక పాత్ర పోషిస్తున్న 'భైరవం' (Bhairavam) సినిమాను 'కన్నప్ప'కు పోటీగా విడుదల చేస్తామని అన్నాడు. మరి ఇప్పుడు 'కన్నప్ప' సినిమా వాయిదా పడిన నేపథ్యంలో 'భైరవం' ఏప్రిల్ 25న విడుదల అవుతుందా లేకపోతే దానినీ పంతం కొద్ది వాయిదా వేస్తారా? అనేది చూడాలి. అయితే మనోజ్ కు అన్న విష్ణుతో వైరం ఉన్నా... 'భైరవం'లో హీరోగా నటిస్తున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అతని తండ్రి బెల్లంకొండ సురేశ్‌ కు మోహన్ బాబుతో సత్ సంబంధాలే ఉన్నాయి. సో... మంచు మనోజ్ కోసం 'భైరవం' సినిమా విడుదల పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉండకపోవచ్చునని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. 'భైరవం' సినిమాను విజయ్ కనకమేడల దర్శకత్వంలో కె.కె. రాధామోహన్ నిర్మించారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ మంచు, అదితి శంకర్, దివ్య పిళ్ళై తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also Read: Chiranjeevi: చిరు సరసన ఈ సారి ఎవరో...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 29 , 2025 | 05:13 PM