Jyothi Raj: రోత స్టెప్పును రీ-క్రియేట్ చేయొద్దు ప్లీజ్!

ABN , Publish Date - Mar 17 , 2025 | 05:32 PM

గత కొంత కాలంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆర్టిస్టులతో వేయిస్తున్న స్టెప్స్ వివాదాస్పదంగా మారుతున్నాయి. వెగటు పుట్టించే ఆ స్టెప్స్ ను కొందరు పిచ్చిగా అనుకరించడాన్ని నెటిజన్స్ తప్పు పడుతున్నారు.

సినిమా అనేది ఎవ‌రికైనా ఓ రిలీఫ్. సినిమా పాటలు మనల్ని మ‌రో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. కాస్త బోర్ కొట్టినా... మూడ్ ఆఫ్ లో ఉన్నా... పాటలు వింటూ చిల్ అవుతుంటారు మ్యూజిక్ లవర్స్. కానీ ఇప్పుడు కొన్నిపాటలు విన్నాలన్నా, చూడాలన్నా ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించాల్సి వ‌స్తోంది. జోష్ ను నింపే పాటలు ఆడియెన్స్‌కు ఇబ్బందిక‌రంగా మారుతున్నాయి. ప్రతి సినిమాలో, ప్రతి పాట‌లో డబుల్ మీనింగ్ పదాలతో పాటు రెచ్చిపోయి మరి చిందులు వేస్తుండ‌టం ఇబ్బందిక‌రంగా మారుతోంది. అది ఐటమ్ సాంగ్ అయితే ఇక చెప్పక్కర్లేదు. ఫ్యామిలీ ఆడియెన్స్ వింటారనే మినిమ‌మ్ కామ‌న్ సెన్స్ లేకుండా మేక‌ర్స్ పాట‌లను డిజైన్ చేస్తున్నారు. దీంతో 'ఎవర్రా మీరంతా? బాధ్యత ఉండక్కర్లేదా!?' అని అడుగుతున్నారు నెటిజన్లు.


యూత్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొన్ని పాటలు హద్దులు దాటుతున్నాయి. ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు మేకర్స్ మ‌రి దిగ‌జారిపోతున్నారు. ఇవి సినిమా పాటలేనా అనుకునే దుస్థితి దాపురిస్తోంది. రీసెంట్ గా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Shekhar Master) హీరోహీరోయిన్లతో వేయిస్తున్న స్టెప్పులు విమర్శలకు దారితీస్తున్నాయి. ఓ వైపు విమర్శల వర్షం కురుస్తున్నా... మరోవైపు పాట ఎలా ఉన్నా... క్యాచీ లైన్స్ ఉండటంతో రీల్స్ మోత మోగిస్తున్నారు అమ్మాయిలు. సేమ్ అలానే రెడీ అయి మరీ... సెప్పులేస్తున్నారు. రాను రాను ఈ కల్చర్ పెరిగిపోతుండటంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తుంటే... మరికొందరు తమ స్వరం వినిపిస్తున్నారు. తాజాగా 'ఆట' సందీప్ (Aata Sandeep) భార్య జ్యోతిరాజ్ (Jyothi Raj) చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


తాజాగా 'రాబిన్ హుడ్' (Robinhood) మూవీ నుండి రిలీజైన 'అది దా సర్ ప్రైజ్' స్పెషల్ సాంగ్ రిలీజ్ అయింది. కేతిక శర్మ చేసిన ఈ పాట ఇలా వచ్చిందో లేదో ఇలా ట్రోలింగ్ కు గురైంది. కానీ ఇవేవి పట్టించుకోకుండా కొంతమంది అమ్మాయిలు ఆ పాటను రీల్స్ తో రీ-క్రియేట్ చేస్తున్నారు. డాన్స్ మూమెంట్స్ అశ్లీలంగా ఉన్నాయనే చర్చ నడుస్తున్న టైంలో డ్యాన్సర్ జ్యోతిరాజ్ రీల్స్ చేస్తున్న అమ్మాయిలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్టెప్పులు ఈ మధ్య శృతి మించుతున్నాయని ఫైరవ్వడంతో పాటు... హీరోలు ఎలాంటి స్టెప్స్ వేసినా చూడ్డానికి ఓకే! కానీ అమ్మాయిలతో ఇంత దారుణమైన మూమెంట్స్ చేయించడం కరెక్ట్ కాదన్నారు. పైగా ఇలాంటి పాటలకు రీల్స్ చేస్తున్న వారికి తనదైన స్టైల్ లో స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. సినిమాల వరకూ ఓకే... కానీ బయట ఇలాంటి పాటలకు డ్యాన్స్ వేస్తే... గలీజ్ గా ఉంటుందని కౌంటర్ ఇచ్చారు. అశ్లీలమైన రోత స్టెప్పులకు రీల్స్ చేయొద్దంటూ వేడుకుంది. జ్యోతిరాజ్ చేసిన కామెంట్స్ కు పలువురు నెటిజన్లు సపోర్ట్ గా నిలుస్తున్నారు. అమ్మాయిలు కాస్త చూసి రీల్స్ చేయండి అంటూ నెటిజన్లు సైతం కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: Allari Naresh: క్రేజీ కాంబోతో 12ఎ రైల్వే కాలనీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 17 , 2025 | 05:32 PM