Jagga Reddy: జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్...

ABN , Publish Date - Mar 10 , 2025 | 12:15 PM

తూర్పు జయప్రకాశ్ రెడ్డి పాలిటిక్స్ లో చాలాయాక్టివ్ గా ఉంటారు. అయితే ఆయన ఇప్పుడో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాఫియాను ఎదురించి ఆడపిల్ల పెళ్ళి చేసే ఓ నాయకుడి కథలో ఆయన నటించబోతున్నారట.

సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినిమాల్లో నటించిన వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళినట్టే... రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సైతం కొందరు సినిమా రంగంతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా... తమకున్న క్రేజ్ దృష్ట్యా సినిమాల్లో అప్పుడప్పుడూ అతిథి పాత్రలు పోషించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బీజేపీ నాయకులు ఆలె నరేంద్ర, సిహెచ్. విద్యాసాగరరావు వంటి వారు సినిమాల్లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. అలానే కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన అద్దంకి దయాకర్ (Addanki Dayakar) ఇటీవలే ఓ సినిమాలో నటించాడు. విశేషం ఏమంటే... ఇప్పుడీ జాబితాలో ఓ కొత్త పేరు జత కాబోతోంది. అది మరెవరిదో కాదు... సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి ఉరఫ్ జగ్గారెడ్డి (Jagga Reddy) ది!

Also Read: Samantha : నందినీ రెడ్డితో సమంత మరోసారి...


ప్రస్తుతం తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డి త్వరలోనే సినిమాల్లో నటించబోతున్నానని న్యూఢిల్లీలో మీడియాకు తెలిపారు. అక్కడి పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, రాజకీయాలలో తాను ఫైట్ చేస్తాను తప్పితే సింపతీ కోరుకోనని అన్నారు. అలానే అతి త్వరలోనే నటుడిగా అరంగేట్రమ్ చేయబోతున్నట్టు తెలిపారు. తాను నటించబోయే సినిమా పేరును కూడా ఆయన వెల్లడించారు. 'జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్' అనేది తన మూవీ టైటిల్ అని తెలిపారు. మాఫియాను ఎదురించి, ఆడపిల్ల పెళ్ళి చేసే వ్యక్తిగా ఆ సినిమాలో తాను నటించబోతున్నానని జగ్గారెడ్డి చెప్పారు. ఈ మధ్య కాలంలో ఓ వ్యక్తి తన దగ్గరకు వచ్చి ఒక కథ ఉందని చెప్పారని, అందులో తనది ప్రధాన పాత్ర అని అన్నారని జగ్గారెడ్డి చెప్పారు. అందులోని పాత్ర తన నిజజీవితానికి దగ్గర ఉంటుందని, స్టోరీ లైన్ తనకు బాగా నచ్చిందని అన్నారు. అందుకే ఈ ఉగాదికి కథ విని, వచ్చే ఉగాది లోపు సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నట్టు జగ్గారెడ్డి చెప్పారు. ఈ సినిమాలో నటించేముందు పీసీసీ అలానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుమతి కూడా తీసుకుంటానని జగ్గారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి భార్య నిర్మలా రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టి.ఎస్.ఐ.ఐ.సి) ఛైర్ పర్సన్ గా సేవలు అందిస్తున్నారు. అలానే జగ్గారెడ్డి రాజకీయ వారసురాలిగా వారి కుమార్తె జయారెడ్డి సైతం క్రియాశీలక రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. మరి ఆమె కూడా తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల నుండి సినిమాల్లోకి వస్తారేమో చూడాలి.

Also Read: Pawan Kalyan: చిరంజీవి మూవీ ప్లేస్ లో పవన్ సినిమా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 10 , 2025 | 12:27 PM