IT Raids Tollywood: ముగిసిన ఐటీ దాడులు.. అంతా ఓకేనా
ABN , Publish Date - Jan 24 , 2025 | 07:01 AM
IT Raids Tollywood: "ఇదంతా పక్కన పెడితే.. ఐటీ శాఖ ఈ మూడు రోజుల్లో ఏం లెక్కలు బయటపెట్టింది అనేది మీడియా ముందు పెడుతుందా? లేకపోతే కేవలం హడావిడేనా? అనేది ప్రేక్షకుడు ఆసక్తికరంగా చూస్తున్నాడు".
ఎట్టకేలకు టాలీవుడ్ ని కలిచివేస్తున్న ఐటీ దాడులు ముగిశాయి. మూడు రోజుల పాటు 55 టీములు 16 చోట్ల దాడులు జరిపాయి. గురువారం అర్థరాత్రితో దాడులు ముగియడంతో టాలీవుడ్ లెక్కలు తేల్చారు ఐటీ శాఖ అధికారులు. మంగళవారం తెల్లవారుజామున మొదలైన ఐటీ దాడులు సినీ పరిశ్రమకి సరికొత్త సినిమాని చూపించాయి. ఇంతకీ ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎవరెవరిపై దాడులు జరిగాయి అంటే..
సంక్రాంతికి రిలీజ్ అయినా సినిమాలు ప్రత్యేకంగా 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాల బడ్జెట్, కలెక్షన్స్ వాటి ట్యాక్స్ లు ట్యాలీ కావడం లేదనే ఆరోపణలతో ఐటీ దాడులు జరిగాయని చర్చ వినిపించింది. అలాగే గతేడాది డిసెంబర్ లో రిలీజ్ అయినా 'పుష్ప 2' సినిమా కలెక్షన్స్, బడ్జెట్ పై అనుమానాలతోనే మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలను ఐటీ అధికారులు టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మ్యాంగో మీడియా, అభిషేక్ పిక్చర్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, ఇతర ఫైనాన్షియర్లపై దాడులు ఎందుకు జరిగాయి? విదేశీ పెట్టుబడుల గురించేనా అనే సరికొత్త చర్చ జరుగుతుంది.
మరో వైపు సినీ నటులు, దర్శకులు కూడా ఈ అంశంపై మాట్లాడుతూ.. క్లారిటీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి చాలా సరదాగా ఈ అంశం గురించి మాట్లాడిన ఎప్పుడు జరగనంత పెద్ద ఎత్తులో దాడి జరగడంతో ఇంతకీ ఏం జరుగుతుందనే కుతూహలం ఏర్పడింది. మరోవైపు హీరో వెంకటేష్ తన రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ.. నేను అయితే వైట్ మాత్రం తీసుకుంటా, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు అనడం కొత్త ప్రశ్నలకు దారి తీసింది. అసలు భారీ రెమ్యూనరేషన్లను నిర్మాతలు ఎలా వైట్ లో ఇవ్వగలుగుతున్నారన్నారు అనేది ప్రశ్నగా మారింది.
ఇదంతా పక్కన పెడితే.. ఐటీ శాఖ ఈ మూడు రోజుల్లో ఏం లెక్కలు బయటపెట్టింది అనేది మీడియా ముందు పెడుతుందా? లేకపోతే కేవలం హడావిడేనా? అనేది ప్రేక్షకుడు ఆసక్తికరంగా చూస్తున్నాడు. ఇప్పటికైనా ఫేక్ కలెక్షన్స్ ని గొప్పగా పోస్టర్లపై వేసుకోవడం, భారీ రెమ్యూనరేషన్లను ఇలా బయటి ప్రపంచం ముందు పెడితే.. బ్లాక్ ని వైట్ అయ్యే వరకు వదలరేమో ఐటీ అధికారులు. చెప్పలేం ఏమైనా జరగవచ్చు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం దిల్ రాజు ఇంట్లో నాలుగో రోజు కూడా దాడులు జరుగుతున్నాయి.