Language Day: మాతృభాషా దినోత్సవం బంగ్లాదేశ్ బంధం...
ABN , Publish Date - Feb 21 , 2025 | 04:22 PM
భాషాభిమానంతో బంగ్లాజనం పోరాటానికి బీజం వేసిన ఫిబ్రవరి 21ని 'అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'గా 'యునెస్కో' పరిగణించింది. 1999 నవంబర్ 17వ తేదీన 'యునెస్కో' ఈ నిర్ణయం తీసుకుంది.
మాతృభాష అంటే మమకారం లేనిది ఎవరికి!? ఏ ప్రాంతం వారికైనా, ఏ దేశం వారికైనా తమ అమ్మ భాషపై ప్రేమాభిమానాలు మెండుగా ఉంటాయి. అలాంటిది తమ తల్లి భాషను తక్కువ చేస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు. బంగ్లాదేశ్ (Bangladesh) వారు తమ మాతృభాష అయిన బెంగాలీ (Bengali) స్థానంలో ఉర్దూ (Urdu)ను అధికార భాషగా చేయడం సహించలేకపోయారు. అందువల్లే మాతృభాష కోసం పోరాటం సాగించారు. 1947లో భారత స్వాతంత్య్రం అనంతరం భారతదేశం, పాకిస్థాన్ రెండు విడిపోయాయి. 1955 దాకా భారతదేశంలోనే ఉన్న అప్పటి తూర్పు బెంగాల్ ఎనిమిదేళ్ళకు పాకిస్థాన్ తో కలసి తూర్పు పాకిస్థాన్ గా వెలసింది. అప్పటికే పాకిస్థాన్ లో ఉర్దూ అధికార భాషగా చెలామనీ అవుతోంది. దాంతో తూర్పు పాకిస్థాన్ లోనూ ఉర్దూనే రాజ్యం చేసింది. అది సహించలేని తూర్పు పాకిస్థాన్ మాతృభాష కోసం పోరాడింది. తత్ఫలితంగానే పాకిస్థాన్ నుండి వేరయ్యింది. బంగ్లాదేశ్ గా అవతరించింది.
బెంగాల్ కు అనుకొని ఉండే బంగ్లాదేశ్ లోనూ వంగభాషనే మాట్టాడతారు. కాకపోతే కొంత యాస ఉంటుంది. అంతే తేడా తప్ప బంగ్లా భాష, బెంగాలీ ఒక్కటే!
తూర్పు పాకిస్థాన్ గా ఉన్న బంగ్లాదేశ్ విడిపోవాలని నిర్ణయించుకున్న తరువాత 1971లో భారత్ సాయంతో పాక్ పై పోరాడి విజయం సాధించింది. స్వతంత్ర దేశం బంగ్లాదేశ్ గా మారింది. భాషాభిమానంతో బంగ్లాజనం పోరాటానికి బీజం వేసిన ఫిబ్రవరి 21ని 'అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'గా 'యునెస్కో' పరిగణించింది. 1999 నవంబర్ 17వ తేదీన 'యునెస్కో' ఈ నిర్ణయం తీసుకుంది. 2000 ఫిబ్రవరి 21వ తేదీన మొదటిసారి 'అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'ను పాటించారు. అంటే ఇప్పటికి పాతికేళ్ళ నుంచీ 'ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే'ను అంతర్జాతీయంగా పాటిస్తున్నారన్న మాట!
బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా పరిగణితమయ్యాక కూడా అక్కడ బెంగాల్ (Indian Bengal), హిందీ (Hindi) సినిమాల ఆధిపత్యమే ఉండేది. మెల్లగా బంగ్లాదేశ్ తమ ప్రాంతం బంగ్లాభాషలోనే సినిమాలను రూపొందిస్తూ వస్తోంది. అనేక హిందీ, తెలుగు (Telugu) సినిమాలను బంగ్లాదేశ్ చిత్రసీమ తమ భాషల్లోకి అనువదించారు కొన్ని రీమేక్ చేశారు. ఇలా సాగుతోన్న బంగ్లాదేశ్ సినిమా తన ఉనికిని చాటుకొనే ప్రయత్నంలో ఉంది. విశేషమేంటంటే అక్కడ జనాన్ని ఆకట్టుకుంటున్న చిత్రాలన్నీ తెలుగు రీమేక్స్ కావడం! ఆ విధంగా తెలుగు భాషా చిత్రాలు సైతం బంగ్లాదేశ్ కు స్ఫూర్తి కలిగిస్తున్నాయని చెప్పవచ్చు.