Aditya Om: పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో ‘బందీ’
ABN , Publish Date - Feb 21 , 2025 | 06:08 PM
నటుడు ఆదిత్య ఓం ప్రధాన పాత్ర పోషించిన సినిమా 'బందీ'. పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సందేశాత్మక చిత్రం ఈ నెలాఖరులో జనం ముందుకు రాబోతోంది.
ఆదిత్య ఓం (Aditya Om) నటించిన 'బందీ' (Bandi) చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో, సందేశాత్మకంగా తెరకెక్కిన తొలి చిత్రం తమదేనని దర్శకుడు రఘు తిరుమల (Raghu Tirumala) చెబుతున్నారు. ఈ చిత్రాన్ని గల్లీ సినిమా (Gully Cinema) బ్యానర్ పై నిర్మించారు. ఇందులో ఆదిత్య ఓం పాత్ర ఎదుర్కొనే పరిస్థితులు, వాతావరణ సమస్యలపై పోరాడే తీరు అద్భుతంగా ఉండబోతోందని, భారతదేశంతో పాటు ఇతర విదేశాల్లోని అనేక అటవీ ప్రాంతాలలో రియల్ లొకేషన్స్ మధ్య ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకులు తెలిపారు. పర్యావరణ ప్రేమికులను కదిలించేలా ఈ చిత్రం ఉంటుందని ఆయన హామీ ఇస్తున్నారు.
'బందీ' చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు వెంకటేశ్వర్ రావు దగ్గు, రఘు తిరుమల తెలిపారు. తొలుత పరిమితమైన స్క్రీన్స్ లోనే దీనిని విడుదల చేసి, ఆ తర్వాత ప్రేక్షకుల స్పందన బట్టి థియేటర్ల సంఖ్య పెంచుతామని అన్నారు. ఈ సినిమాను ఎన్జీఓస్ తోనూ, సామాజిక సంస్థలతోనూ కలిసి ప్రమోట్ చేసే పనిలో ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన లభించిందని మేకర్స్ తెలిపారు.