Mazaka: ఆ విషయం సందీప్ కు తెలియదట!
ABN , Publish Date - Feb 23 , 2025 | 06:14 PM
'పీపుల్స్ స్టార్' అనగానే అందరికీ గుర్తొచ్చే వ్యక్తి ఆర్. నారాయణమూర్తి. విప్లవాత్మక చిత్రాలు తెరకెక్కించే నారాయణమూర్తికి ఉన్న ఆ బిరుదును తాజాగా 'మజాకా' నిర్మాత అనిల్ సుంకర... హీరో సందీప్ కిషన్ కు కట్టబెట్టేశారు.
యువ కథానాయకుడు సందీప్ కిషన్ (Sundeep Kishan) కు 'పీపుల్ స్టార్' అనే బిరుదును ఇవ్వడంపై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలోనే కాదు చిత్రసీమలోనూ చర్చ జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై సందీప్ కిషన్ తో పాటు ఆ బిరుదును అతనికి ఇచ్చిన నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) సైతం స్పందించారు. ఆదివారం సందీప్ కిషన్ నటిస్తున్న 30వ చిత్రం 'మజాకా' (Mazaka) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ప్రేమలో పడిన తండ్రీ కొడుకుల కథతో ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా దర్శకుడు త్రినాథరావు నక్కిన (Trinadharao Nakkina) తెరకెక్కించినట్టు ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతోంది. ఈ నెల 26న శివరాత్రి కానుకగా 'మజాకా' జనం ముందుకు రాబోతోంది.
ఈ విషయం ఇలా ఉంటే... ఈ వేదికపై 'పీపుల్స్ స్టార్' అనే బిరుదుపై సందీప్ కిషన్ వివరణ ఇచ్చాడు. నిజానికి పేరు ముందు బిరుదులు పెట్టుకోవడంపై తనకంత ఆసక్తి ఉండదని అన్నాడు. వాటి గురించి పట్టించుకోననీ చెప్పాడు. అంతేకాదు... అసలు 'పీపుల్స్ స్టార్' అనే బిరుదు ఆర్. నారాయణమూర్తికి ఉందనే విషయమే తనకు తెలియదని అన్నాడు. దాదాపు పదిహేనేళ్ళుగా చిత్రసీమలో సందీప్ కిషన్ ఉన్నాడు. అంతేకాకుండా అతని మేనమామలు ఛోటా కె నాయుడు, శ్యామ్ కె నాయుడు సైతం ఈ రంగంలో కొన్నేళ్ళుగా సినిమాటోగ్రాఫర్స్ గా రాణిస్తున్నారు. మరి ఇంతకాలంగా ఈ రంగంలో ప్రత్యక్ష సంబంధం ఉన్న సందీప్ కిషన్... ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తికి 'పీపుల్స్ స్టార్' అనే బిరుదు ఉందని తెలియదనడం కాస్తంత విడ్డూరంగా ఉందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.
'మజాకా' చిత్ర నిర్మాత అనిల్ సుంకర అయితే... సందీప్ కిషన్ కు 'పీపుల్స్ స్టార్' అనే బిరుదు తానే ఇచ్చానని చెప్పారు. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' నాటి సందీప్ కిషన్ కాదని... ఇప్పుడు అతని స్థాయి పెరిగిందని, అసలు ఈ బిరుదు ఎందుకు ఇచ్చామో రాబోయే రోజుల్లో తెలుస్తుందని అన్నారు. సందీప్ కిషన్ నటుడిగా చక్కని విజయాలను అందుకోవాలని, మల్టిపుల్ లాంగ్వేజెస్ లో ఆర్టిస్ట్ గా మరింత గుర్తింపు తెచ్చుకోవాలని అందరూ కోరుకుంటారు. అందులో సందేహమే లేదు. కానీ ఆర్. నారాయణమూర్తికి ఉన్న బిరుదును లాగేసుకుని... ఇంకే బిరుదులు లేనట్టుగా అదే సందీప్ కిషన్ కు పెట్టడం భావ దారిద్రం కాకమరేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.