Vijaya Nirmala: నిర్మలను వరించి వచ్చిన 'విజయం'...

ABN , Publish Date - Feb 21 , 2025 | 12:09 PM

ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల దక్షిణాది చిత్రసీమలో తనదైన ముద్రను వేశారు. అయితే ఆమె పేరు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.

తెలుగు చిత్రసీమలో నటి, దర్శకురాలు విజయనిర్మల (Vijayanirmala) బాణీ అనితరసాధ్యం! అత్యధిక కథాచిత్రాలను తెరకెక్కించిన దర్శకురాలిగా 'గిన్నిస్ బుక్' పుటల్లో చోటు సంపాదించారామె. ఆమె పేరులోనే 'విజయం' కొలువై ఉండడం వల్లే పలు విజయాలు ఆమె దరిచేరాయని సినీజనం అంటూ ఉంటారు.

విజయనిర్మల తొలిసారి తెరపై కనిపించిన తెలుగు చిత్రం యన్టీఆర్ (NTR) సొంత సినిమా 'పాండురంగమహాత్మ్యం' (1957). అయితే అంతకు ముందే తన నాలుగేళ్ళ ప్రాయంలో నిర్మల 'మచ్చరేఖై' (Macha Rekai)(1950) అనే తమిళ చిత్రంలో కనిపించారు. టి.ఆర్. మహాలింగం మచ్చరాజుగా నటించిన ఈ సినిమాలో చిన్నప్పటి మచ్చరాజుగా నిర్మల అభినయించారు. ఇదే నిర్మల తెరపై కనిపించిన మొట్టమొదటి సినిమా. ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు పి.పుల్లయ్య (P.Pullayya)నే దర్శకత్వం వహించడం వల్ల నిర్మల చురుకుతనం గురించి ఆయన, ఆయన భార్య నటి శాంతకుమారి విశేషంగా చెప్పేవారు. అలా నందమూరి సోదరులకు నిర్మల గురించి తెలిసింది. తాము 'పాండురంగ మహాత్మ్యం' నిర్మించే సమయంలో బాలకృష్ణుని పాత్రకు నిర్మలను ఎంపిక చేసుకున్నారు. ఆ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ "జయకృష్ణా ముకుందా మురారి..." ఈ నాటికీ అలరిస్తూనే ఉంది. ఈ పాటలోనూ, కొన్ని సీన్స్ లోనూ నిర్మల శ్రీకృష్ణునిగా కనిపించారు. తరువాత 'భూకైలాస్' (1958)లో "రాముని అవతారం..." పాటలో సీతగా తళుక్కుమన్నారు.


'భూకైలాస్' తర్వాత కొన్ని తెలుగు, తమిళ, మళయాళ చిత్రాల్లో నటించినా, ఆమెను 'విజయ'నిర్మలగా మార్చిన చిత్రం తమిళంలో తెరకెక్కిన 'ఎంగవీట్టు పెన్' (Enga Veettu Penn) (1965). ఇదే ఆమె కథానాయికగా రూపొందిన తొలి సినిమా. విజయా సంస్థ నిర్మించిన ప్రప్రథమ చిత్రం 'షావుకారు' (1950) ఆధారంగా 'ఎంగవీట్టు పెన్' రూపొందింది. తెలుగులో జానకి పోషించిన నాయిక పాత్రను తమిళంలో నిర్మల ధరించారు. అప్పటికే తెలుగులో ఓ నిర్మల, తమిళంలో మరో నిర్మల చిత్రసీమలో రాణిస్తున్నారు. దాంతో ఈ నిర్మలకు ప్రత్యేకత ఉండాలని చిత్ర నిర్మాతల్లో ఒకరైన చక్రపాణి (Chakrapani) తమ 'విజయ' సంస్థ పేరును ముందు అతికించారు. అలా విజయ సంస్థ ద్వారా హీరోయిన్ గా పరిచయమైనందున నిర్మల కాస్త 'విజయనిర్మల'గా వెలుగొందారు. అలా మారగానే ఆమె కెరీర్ పెద్ద మలుపు తిరిగింది. పలు అవకాశాలు విజయ నిర్మలను వెదుక్కుంటూ వచ్చాయి. నిజానికి కెరీర్ ప్రారంభంలో ఆమె నీరజ పేరుతోనూ కొన్ని చిత్రాలలో నటించారు. అంతేకాదు... నటశేఖర కృష్ణ (Krishna)కు విజయనాయికగానూ విజయనిర్మల మారారు. ఆ తరువాత కృష్ణ జీవితనాయికగానే నిలిచారు విజయనిర్మల!

Updated Date - Feb 21 , 2025 | 12:09 PM