SS Rajamouli: రాజమౌళి విష్ చేయడం వెనుక పెద్ద కథే ఉంది.
ABN , Publish Date - Mar 06 , 2025 | 03:52 PM
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటించబోయే సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆ సినిమా ఎక్కడ షూటింగ్ జరుపుకుంటుంది? ఎవరెవరు నటిస్తున్నారు? ఎలా తెరకెక్కుతోంది? ఎప్పుడు రిలీజవుతుంది? అన్న అంశాలు అభిమానుల మదిలో చిందులు వేస్తున్నాయి
డైనమిక్ డైరెక్టర్, దర్శకధీరుడు, గ్లోబల్ స్టార్ డైరెక్టర్ - ఇలాంటి బిరుదులు ముందు రాజమౌళి (SS Rajamouli) పేరుకు ముందు తగిలించేసి అభిమానులు ఆనందిస్తుంటారు. నిజానికి రాజమౌళి అన్న పేరే నేడు సినీఫ్యాన్స్ ను పులకింప చేస్తోంది. రాజమౌళి సినిమాలను చూస్తే కొన్ని అంశాలు అంతకు ముందు ఏదో ఒక చిత్రంలో ఉన్నవే అన్న భావన కలుగుతూ ఉంటుంది. ఆయన కూడా అవుననే అంటారు తప్ప ఏనాడూ తాను ఇతరుల సినిమాల నుండి స్ఫూర్తి చెందలేదని చెప్పరు. తనను ఇన్ స్పైర్ చేసిన సీన్ ఎవరిదైనా సరే, తాను రీక్రియేట్ చేస్తే అందులో తన స్టైల్ ను మిక్స్ చేస్తాననీ అంటారు రాజమౌళి. అలా అంతకు ముందు స్ఫూర్తి కలిగించిన మేకర్ కు తాను ట్రిబ్యూ ఇస్తానని రాజమౌళి చెబుతూ ఉంటారు. ప్రస్తుతం రాజమౌళి పేరు దేశంలోనే కాదు విదేశాల్లోనూ మారుమోగి పోతోంది. ఈ నేపథ్యంలో ఆయన దర్శకత్వంలో మహేశ్ బాబు నటించబోయే సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆ సినిమా ఎక్కడ షూటింగ్ జరుపుకుంటుంది? ఎవరెవరు నటిస్తున్నారు? ఎలా తెరకెక్కుతోంది? ఎప్పుడు రిలీజవుతుంది? అన్న అంశాలు అభిమానుల మదిలో చిందులు వేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ప్రకటించిన ఆస్కార్ అవార్డు విజేతలందరికీ రాజమౌళి అభినందనలు తెలిపారు. అంతటితో ఆగితే ఆయన రాజమౌళి ఎందుకవుతారు. ఈ యేడాది 'బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్' కేటగిరీలో బ్రెజిల్ సినిమా 'ఐ యామ్ స్టిల్ హియర్' (I am still here) ఆస్కార్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్ర దర్శకుడు వాల్టర్ సాలెస్ (Walter Salles) కు రాజమౌళి ప్రత్యేక అభినందనలు తెలియజేయడం విశేషం! ఎందుకంటే ఇప్పటి దాకా బ్రెజిల్ దేశానికి ఒక్క ఆస్కార్ అవార్డు కూడా దక్కలేదు. అలాంటిది వాల్టర్ తెరకెక్కించిన 'ఐ యామ్ స్టిల్ హియర్' సినిమా అకాడెమీ అవార్డ్స్ లో 'బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్'గా ఎన్నిక కావడం బ్రెజిల్ దేశవాసులకు ఓ పండుగలా మారింది. దాంతో 'ఐ యామ్ స్టిల్ హియర్' సినిమాకు సంబంధించిన అంశాలతో ఓ మ్యూజియమ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. బ్రెజిల్ దేశవాసుల ఆనందం చూసి అందరూ అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి కూడా వాల్టర్ సాలెస్ ను అభినందించారు అనుకుంటే పొరబాటే!
రాజమౌళి ఇంతకు ముందు చిత్రం 'ట్రిపుల్ ఆర్' (RRR) కు ఇప్పుడు బెస్ట్ ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్న బ్రెజిల్ సినిమా డైరెక్టర్ కు ఓ సంబంధం ఉందట! ఏమై ఉంటుంది? తన మాతృభాష తెలుగు సినిమాతో ఇండియాకు తొలి ఆస్కార్ అవార్డును రాజమౌళి 'ట్రిపుల్ ఆర్' సంపాదించినట్టే, వాల్టర్ తీసిన 'ఐ యామ్ స్టిల్ హియర్' బ్రెజిల్ కు మొట్టమొదటి ఆస్కార్ ను అందించింది - అదే కదా! అని చాలామంది భావించవచ్చు. అదికాదు అసలు విషయం- 'ట్రిపుల్ ఆర్' చిత్రం తీయడానికి స్ఫూర్తి ఇచ్చినదే వాల్టర్ సాలెస్ సినిమా అట! అవును... 2004లో వాల్టర్ సాలెస్ తెరకెక్కించిన 'ద మోటార్ సైకిల్ డైరీస్' (The Motorcycle Diaries)సినిమాను చూసి ప్రపంచ వ్యాప్తంగా ఎందరో సినీఫ్యాన్స్ ఆనందించారు. ఆ సినిమా ప్రేరణతోనే తెలుగులో క్రిష్ తన తొలి చిత్రం 'గమ్యం' (Gamyam) రూపొందించి సక్సెస్ సాధించారు. రాజమౌళికి కూడా 'ద మోటార్ సైకిల్ డైరీస్' సినిమా ఎంతగానో నచ్చింది. ఆ సినిమాను ప్రఖ్యాత పోరాటయోధుడు చే గువెరా జీవితంలోని అంశాలతో వాల్టర్ తెరకెక్కించారు. ఆ సినిమా చూశాక రాజమౌళికి కూడా మన దేశానికి చెందిన అమరవీరుల గాథతో ఇద్దరు మిత్రుల నేపథ్యంలో సినిమా తీయాలన్న ఆలోచన కలిగింది. ఆ ఆలోచన నుండి వెలుగు చూసిందే 'ట్రిపుల్ ఆర్' సినిమా! అందువల్లే తనకు స్ఫూర్తినిచ్చిన దర్శకుడు వాల్టర్ సాలెస్ సినిమాకు ఆస్కార్ రాగానే రాజమౌళి మరింతగా ఆనందిస్తున్నారు.